ప్రపంచంలో సంతాన సాఫల్య కేంద్రాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయంటే దానికి కారణం ప్రజల్లో పెరుగుతున్న పునరుత్పత్తి సమస్యలు. పిల్లలు పుట్టకపోతే సమస్య ఆడవాళ్లదే అనుకుంటారు చాలా మంది, కానీ అధిక సమస్యలు మగవారిలోనే ఉంటున్నాయి. బయటికి వారు ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ వారిలో దాక్కున్న పునరుత్పత్తి సమస్యల వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది. నిందలు మాత్రం ఆడవారి మీదే పడుతున్నాయి. గర్భం దాల్చడం కష్టమవుతున్నప్పుడు మగవారు తమ స్పెర్మ్ కౌంట్‌ను పరీక్షించుకోవాలి. వాటి సంఖ్య తక్కువగా ఉన్నా కూడా పిల్లలు కలిగే అవకాశం తగ్గిపోతుంది.ఒక పురుషుడిలో 39 మిలియన్ల కంటే తక్కువ స్పెర్మ్ కణాలు కలిగి ఉంటే దాన్ని సమస్యగా భావించవచ్చు. ఇలా తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను కలిగి ఉన్న సమస్యను ‘ఒలిగోస్పెర్మియా’ అంటారు. వారికున్న ఓ మూడు అలవాట్లు వారిలో వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తున్నట్టు హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. బిడ్డను కనాలనుకుంటే వీటికి దూరంగా ఉండమని సూచిస్తున్నారు.


ఆల్కహాల్
ఆల్కహాల్ రోజూ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. ఇది మీ లైంగిక జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు పురుషులకు ముఖ్యమైన టెస్టోస్టెరాన్ హార్టన్ స్థాయిలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ అతిగా తాగడం మానేయాలి. చాలా మితంగా తాగితే ఏ సమస్య రాదు. పూర్తిగా మానేస్తే మరీ ఆరోగ్యం. 


ప్రాసెస్డ్ మీట్
మాంసాహారాన్ని ప్రాసెస్ చేసి ప్యాకెట్లలో అమ్ముతారు. బేకన్, హాట్ డాగ్, సలామీ... ఇలా రకరకాల పేర్లతో మార్కెట్లో అమ్మకానికి దొరుకుతున్నాయి. అతిగా శుద్ధి చేసిన ఈ మాంసం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అంతేకాదు వీర్య కణాలు చురుగ్గా కదలలేవు. దీని వల్ల గర్భం దాల్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. 


 పాల ఉత్పత్తులు
వెన్న తీయని పాలల్లో అధికంగా ఈస్ట్రోజెన్ ఉంటుంది. అలాగే పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు స్టెరాయిడ్లు కూడా ఇస్తుంటారు. ఈ రెండింటి వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వెన్న తీసేసిన పాలనే తాగాలి. జున్ను, చీజ్, బటర్ వంటి అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను తగ్గించాలి. బాదం పాలు పుష్కలంగా తాగొచ్చు. 



Also read: ప్రపంచంలో పరమ బోరింగ్ ఉద్యోగాలు ఇవే, పరిశోధనలో తేల్చిచెప్పిన సైకాలజిస్టులు



Also read: రోజూ పాలు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు?