మధుమేహం రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పుడు వచ్చే వ్యాధి. ఇన్సులిన్ అనే హార్మోనును ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది.  ఈ ఇన్సులిన్, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చేందుకు ఉపయోగపడుతుంది.  టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారవదు. అప్పుడు గ్లూకోజ్ శక్తిగా మారకుండా రక్తంలోనే పేరుకుపోతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.  ఏ వయసులోనైనా ఈ మహమ్మారి రావచ్చు. కానీ ఎక్కువ మధ్య వయస్కులలో, వృద్ధులలో కనిపిస్తుంటుంది. లేదా అధిక బరువు,  ఊబకాయం ఉన్న వారిలో, కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారిలో కచ్చితంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. కానీ ఇప్పుడు ఓ కొత్త అధ్యయనం మరో విషయం కూడా కనిపెట్టింది. తెల్లగా ఉన్న వారితో పోలిస్తే రంగు తక్కువ ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం రెండురెట్లు ఎక్కువ. 


ఇలా సాగింది పరిశోధన...
అమెరికాలోని తెలుపు జాతీయులు, నలుపు జాతీయులపై ఈ పరిశోధన సాగింది. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన నలుపు, తెలుపు జాతీయులను ఎంపిక చేశారు. వారి సంఖ్య 4,251. వారిలో ఎవరికీ మధుమేహం లేదు. వారిని 24 ఏళ్లకు పైగా గమనిస్తూ వచ్చారు. ఇప్పుడు వారిని తిరిగి పరిశోధించగా 504 మందికి మధుమేహం వచ్చింది. వారిలో 315 మంది నల్లజాతీయులు కాగా, 189 మంది తెల్లవాళ్లు.  తెల్లగా ఉన్నవారితో పోలిస్తే నల్లజాతి మహిళలకు మధుమేహం వచ్చే అవకాశం దాదాపు మూడు రెట్లు అధికంగా ఉందని, అదే నల్లజాతి మగవారిలో 67 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ప్రతి వెయ్యిమంది తెల్ల జాతీయుల్లో 86 మంది డయాబెటిస్ బారిన పడుతుంటే, నల్లజాతీయుల్లో 152  మంది పడుతున్నట్టు అంచనా.


కారణాలు ఇవి కావచ్చు...
కేవలం రంగు కారణంగానే ఇంతగా వ్యత్యాసం కనిపిస్తుందా అని పరిశోధకులు అధ్యయనం చేశారు. అందులో నలుపు జాతీయుల్లో అధికంగా పేదరికంలో, శుభ్రత లేని ప్రదేశాల్లో, సామాజికంగా, ఆర్ధికంగా దీన పరిస్థితుల్లో బతుకుతున్నారని అందుకే ఆ ప్రభావమంతా శరీరంపై కూడా పడిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆరోగ్య అసమానతలను గుర్తించారు. ఊబకాయం, రక్తపోటు, ఊపిరితిత్తుల పనితీరు, ఆహారం లేక పస్తులు ఉండడం... ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషించి ఉంటాయని భావిస్తున్నారు. కేవలం రంగు ఒక్కటే వారిలో మధుమేహం వచ్చే అవకాశాన్ని పెంచుతుందని తమ ఉద్దేశం కాదని చెప్పారు అధ్యయనకర్తలు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read:  పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందా? ఇందులో నిజమెంత?


Also read:  బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం