తినే పదార్థాల విషయంలో ప్రజల్లో చాలా అపోహలు, భయాలు ఉన్నాయి. అందులో ఒకటి పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు అని. ఆ రెండూ కలిపి వండితే విషపూరితం అవుతుందని, తినకూడదనే భయాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఆ రెండింటి కాంబినేషన్ కూర తినరు. అంతేకాదు గుడ్డు తిన్న రోజు, పొట్లకాయ తినరు కొంతమంది. ఇందులో నిజమెంత? ఆ రెండు కలిపి తింటే నిజంగానే విషపూరితం అవుతుందా?
రెండూ మంచివే...
ముందుగా ఈ రెండింటి గురించి విడివిడిగా తెలుసుకుందాం. పొట్లాకాయ పీచు పదార్థం. దీనిలో అధికంగా నీరు ఉంటుంది. విటిమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల విషపూరిత రసాయనాలు, పదార్థాలను బయటకు పంపి, అవయవాల పనితీరు మెరుగుపడేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు పొట్లకాయ తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. కాలేయానికి పొట్లకాయ కూర చాలా మంచిది. మధుమేహం ఉన్నవారికి పొట్లకాయ మేలు చేస్తుంది.
ఇక గుడ్డు సంగతికొస్తే సంపూర్ణ ఆహారంగా దీన్నే పిలుస్తారు. ఎక్కువ పోషకాలతో తక్కువ ధరకు లభించే ఆహారం ఇది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. దీనిలో మనకు అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది. ఒక గుడ్డులో 100 మిల్లీ గ్రాముల కొలైన్ ఉంటుంది. ఇది ఒక అరుదైన పోషకం. మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటిచూపుకు గుడ్డు తినడం చాలా అవసరం. గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లయిన లూటిన్, జియాక్సాంతిన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి.
ఈ రెండూ కలిపి తింటే విషమా?
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందని అంటారు, కానీ అలాంటిదేమీ లేదు. ఎలాంటి భయం లేకుండా ఆ కూరను వండుకుని తినొచ్చు. కాకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉంటే మంచిది. రెండు కాంబినేషన్లు కలిపి వంట చేస్తున్నప్పుడు ఆ రెండూ ఒకే సమయంలో జీర్ణమయ్యేవి అయితే ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రావు. అయితే పొట్లకాయలో నీటి శాతం అధికం ఇది త్వరగా అరిగిపోతుంది. కానీ కోడిగుడ్డులో ప్రోటీన్స్, కొవ్వుఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇది అరగడానికి కాస్త సమయం పడుతుంది. ఈ రెండు కలిపి వండినప్పు జీర్ణమయ్యే సమయంలో తేడాలొస్తాయి. అలాంటప్పుడు కొందరిలో స్వల్పకాలం పాటూ గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది అందరిలోనూ రావాలని లేదు. ఇంతకుమించి ఈ కూరతో వచ్చే ప్రమాదం ఏమీ లేదు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం