ట్రావెలింగ్ పై ఆసక్తి అధికమవుతున్న రోజులివి. కేవలం ట్రావెలింగ్ కోసమే ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడబెట్టుకునే వారు కూడా ఉన్నారు. వివిధ దేశాల్లోని కొత్త విషయాలను తెలుసుకోవడమే వారి లక్ష్యం. కొత్త దేశాల్లో పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీదే ఆధారపడుతున్నవారు ఎక్కువమందే. ఎందుకంటే డ్రైవింగ్ వచ్చినా కూడా ఆ దేశపు డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే బండి నడపకూడదు. అయితే కొన్నిదేశాల్లో మాత్రం ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు గుర్తింపు ఉంది. ఆ కంట్రీలకు వెళ్లినప్పుడు మాత్రం మీరు చక్కగా రోడ్డుపై ద్విచక్రవాహనాలు, కార్లు నడపచ్చు. ఆ దేశంలో మీ ప్రయాణం మరింత సులభతరం అవుతంది. అయితే కొద్ది నెలల పాటే అవి చెల్లుబాటు అవుతాయి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తించే విదేశాలు ఇవిగో...
ఆస్ట్రేలియా
భారతీయులు అధికంగా వెళుతున్న దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. మీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఈ దేశం చెల్లుబాటు అవుతుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పై ఆధారపడటం లేదా ప్రత్యేకంగా డ్రైవర్‌ను నియమించుకోవాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతాలలో మూడు నెలల పాటూ మన లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. అదే న్యూసౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియ, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ ప్రాంతాల్లో అయితే భారత డైవింగ్ లైసెన్స్ ఒక ఏడాది పాటూ చెల్లుతుంది.
బ్రిటన్
ఈ దేశంలో పర్యాటకులను ఆకర్షించే కట్టడాలు, ప్రాంతాలు ఎక్కువే. అందుకే పాస్ పోర్ట్, లైసెన్స్ చూపిస్తే చాలు ఏడాది పాటూ కార్లు, బైకులు డ్రైవ్ చేయచ్చు. ఇంగ్లాండు, స్కాట్లాండ్, వేల్స్ దేశాల్లో మన లైసెన్స్‌ను అంగీకరిస్తారు.
జర్మనీ
ప్యాలెస్‌లు, స్కైస్క్రాపర్లతో ఆకట్టుకునే దేశం జర్మనీ. మన లైసెన్స్ తో ఆ దేశంలో ఆరు నెలల పాటూ దర్జాగా కార్లు, బైకులపై తిరగచ్చు.
అమెరికా
అమెరికాలో భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రతి ఏటా వేల మంది ఆ దేశాన్ని చేరుతున్నారు. అక్కడ కూడా ఏడాది పాటూ మన లైసెన్స్ చెల్లుతుంది. ఆ తరువాత కూడా డ్రైవ్ చేస్తే ఊచలు లెక్కపెట్టవలసి వస్తుంది.
స్వీడన్
అందమైన దేశం అనగానే గుర్తొచ్చేది స్వీడన్. ఈ దేశంలో కూడా ఏడాది వరకు మన లైసెన్స్ చెల్లుతుంది. ఆ తరువాత దేశం విడిచి వెళ్లాలి లేదా ఏ వాహనాలు డ్రైవ్ చేయకూడదు.
న్యూజిలాండ్
ఈ దేశంలోనూ 21 ఏళ్లు నిండి, భారతీయ లైసెన్స్ ఉన్న వాళ్లు ఏడాది పాటూ హ్యాపీగా డ్రైవింగ్ చేయవచ్చు.
సింగపూర్
మనదేశంలో నుంచి కేవలం నాలుగ్గంటలో సింగపూర్ వెళ్లిపోవచ్చు. అక్కడ నివసించే భారతీయుల సంఖ్య కూడా ఎక్కువే. అక్కడ కూడా ఏడాది పాటూ మన లైసెన్స్ కు కాలపరిమితి ఉంటుంది. ఒక్కోసారి మాత్రం స్థానికంగా ఇచ్చే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవే కాదు ఫిన్ లాండ్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో కూడా తక్కువ కాలపరిమితిపై ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది.
Also read: బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం