వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఉరితాడు, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. తన భూమిని రిజిస్టర్ చేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని గట్టిగా అరుస్తున్నాడు.
ఈ సీన్ చూసిన వాళ్లంతా అయ్యో పాపం అనుకున్నారు. అధికారులకు ఎంత బలుపు.. బాధితుడి గోడు పట్టించుకోరేంటని చీదరించుకున్నారు. అధికారులు పట్టించుకోలేదు కానీ పోలీసులు వచ్చి అతడు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా పట్టుకున్నారు.
అధికారులకు వద్దకు తీసుకెళ్లి అతని సమస్యేంటి.. ఎందుకు పరిష్కరించడం లేదని ఆరా తీశారు. అప్పుడు వాళ్లు చెప్పిన అసలు సంగతి విని షాక్ తిన్నారు. ఇలా కూడా బరితెగిస్తున్నారా అంటూ ఆశ్చర్యపోయారు.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి బెదిరంపుల కేసులు ఎక్కువైపోతున్నాయట. రియల్‌ఎస్టేట్ పేరుతో బోర్డులు పెట్టేసుకొని కబ్జా భూములు, అమ్మిన భూములనే మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.
ఇప్పుడు ఇలాంటి అక్రమాలు చేసేందుకు అవకాశం లేదని.. అంతా ఆన్‌లైన్ అయ్యాక చీటింగ్‌కు వీలుకాదని చెప్పినా వినడం లేదట. అలా చేస్తే తాము ఇరుక్కుంటామని అధికారులు చెబుతున్నా సదరు వ్యక్తులు పట్టించుకోవడం లేదట.
ఈ మధ్య కాలంలో ఇలాంటి ముఠాలు ఎక్కువైపోయాయని అధికారులు వాపోతున్నారు. పని చేయమని ఒత్తిడి చేస్తున్నారని కాదు కూడదని చెబితే ఆత్మహత్య చేసుకుంటామని కార్యాలయం వద్దే బెదిరంపులకు దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోతున్నాయంటున్నారు.
ఇలాంటి వ్యక్తులు కార్యాలయాల వద్ద హల్ చల్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. వీటి అసలు నిజాలు తెలుసుకోకుండా చాలా మంది షేర్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని... తమపై నిందలు వేస్తున్నారని వాపోతున్నారు.
వికారబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా హడావుడి చేసిన వ్యక్తి కూడా వక్ఫ్‌బోర్డు భూములు కాజేసేందుకు యత్నించాడని... రిజిస్ట్రేషన్ చేయించుకోవాని యత్నించాడని చెప్పారు అధికారులు. కాదన్నందుకు ఇలా కార్యాలయం వద్ద పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశాడంటూ పోలీసులకు చెప్పారు.
అసలు సంగతి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. నిజం తెలుసుకున్న అక్కడి ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటున్నారు. నిజంగా సమస్యతో వచ్చే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: గవర్నర్‌పై దీదీ ఫైర్.. ఏకంగా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సీఎం!