Link Between PCOS and Breast Cancer : పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఈ రోజుల్లో మహిళల్లో వచ్చే చాలా సాధారణమైన హార్మోన్ల రుగ్మతలలో ఒకటి. ఇది పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పీరియడ్స్ సమయానికి రాకపోవడం, అండాశయ తిత్తులు, ఆండ్రోజెన్‌ల (పురుష హార్మోన్లు) స్థాయిలు పెరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. PCOS తరచుగా ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, దీర్ఘకాలిక మంట వంటి జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఇది ప్రధానంగా సంతానోత్పత్తిపై దాని ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ.. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెప్తున్నారు డాక్టర్ పంకజ్ గోయల్.
PCOS, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధమిదే
PCOS, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధం ఎక్కువగా హార్మోన్ల అసమతుల్యతతో ముడిపడి ఉంది. PCOS ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దానిని సమతుల్యం చేయడానికి తగినంత ప్రొజెస్టరాన్ ఉండదు. దీనివల్ల రొమ్ము కణాలు సాధారణంగా కంటే ఎక్కువగా పెరగడానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు ఇలాంటి అసాధారణ మార్పులు జరుగుతాయి. అదనంగా ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ హార్మోన్లు, పెరుగుదల కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది రొమ్ములో కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పరిశోధన ఫలితాలివే
PCOS, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధంపై ఇప్పటివరకు చేసిన పరిశోధనలు ఏకాభిప్రాయ ఫలితాలు ఇవ్వలేదు. కానీ కొన్ని అధ్యయనాలు PCOS ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం స్వల్పంగా పెరిగిందని సూచిస్తున్నాయి. మరికొన్ని పరిశోధనల్లో ఇవి కనిపించలేదు. బరువు, వయస్సు, జన్యుశాస్త్రం, పునరుత్పత్తి చరిత్రలో వ్యత్యాసాల కారణంగా ఈ వ్యత్యాసం ఉండవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. అలా చూస్తే.. PCOS,రొమ్ము క్యాన్సర్ రెండింటికీ ఊబకాయం, నిశ్చలమైన జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక ప్రమాద కారకాలు కారణమవుతున్నాయని తెలిపారు.
PCOS ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
PCOS నిర్ధారణ అయిన మహిళలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడం వల్ల హార్మోన్ల స్థాయిలను నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా రొమ్ము స్వీయ-పరీక్షలు, 40 ఏళ్లు పైబడితే సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రారంభ దశలోనే కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. దానిలో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి.
PCOS నేరుగా రొమ్ము క్యాన్సర్‌కు కారణం కానప్పటికీ.. జీవక్రియ, హార్మోన్ల వల్ల దీని వ్యాప్తి మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. PCOS ఉన్న మహిళలు తమ ఆరోగ్యం గురించి తెలుసుకునేలా, సకాలంలో వైద్య సలహా తీసుకునేలా చూడాలని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ కన్సల్టెంట్గా చేస్తోన్నా డాక్టర్ పంకజ్ గోయల్ తెయిపారు. ఇలా చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ నివారణ చేయవచ్చని చెప్తున్నారు. అలాగే శరీరంలో మార్పులు గమనిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.