గురక అంటే కేవలం పక్కోడిని ఇబ్బంది పెట్టే సమస్యే అనుకుంటారు. వాస్తవానికి గురక పెట్టే వ్యక్తికి అది చాలా ప్రమాదకరమైన సమస్య. గురక వస్తుందంటే.. అది అనారోగ్యం వల్లనే. కాబట్టి, గురకను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే, గురకను కంట్రోల్ చేయడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూసేయండి. 


గొంతులో, అంగిలిలో ఉండే కండరాల పటుత్వం తగ్గిపోవడం వల్ల నిద్ర పోయినపుడు అవి పూర్తిగా రిలాక్స్ అయిపోతాయి. ఫలితంగా అవి శ్వాసకు అడ్డంకి కలిగిస్తాయి. అందువల్ల శ్వాసలో పెద్ద పెద్ద శబ్ధాలు వస్తుంటాయి. దాన్నే మనం గురక అని పిలుస్తాం. ఇవి శ్వాస మార్గానికి ఆటంకం కలిగించడం వల్ల, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల గుండె సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఒక చిన్న సాక్సుతో గురకను మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


సాక్సులు పాదాలను వెచ్చగా ఉంచేందుకు మాత్రమే కాదు గురకను తగ్గించడానికి కూడా వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉన్న సాక్సుల వల్ల గురకను తగ్గించుకోవచ్చు అని తెలుపుతున్నారు. 


డీప్ వీన్ థ్రాంబోసిస్ సమస్య కలిగినవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కంప్రెషన్ సాక్స్‌ రూపొందిస్తున్నారు. దీన్ని ఉపయోగించి స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నవారిలో మంచి ఫలితాలను రాబట్టేందుకు ఫ్రాన్స్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దాని కోసం ఫ్రెంచ్ నిపుణులు.. 24 మంది పేషెంట్లను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. రోజంతా కంప్రెషన్ సాక్స్ వేసుకుని ఉండేవారిలో స్లీప్ అప్నియా తగ్గుతుందా, లేదా అని అధ్యయనం చేస్తున్నారు. పగటి పూట పాదాల్లో చేరే ఫ్లూయిడ్ తగ్గించడం లో కంప్రెషన్ సాక్స్ ఉపయోగకరంగా ఉంటుందని, ఫలితంగా రాత్రివేళ గురక తగ్గుతుందని వెల్లడించారు. 


స్లీప్ ఆప్నియా సైలెంట్ కిల్లర్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్లీప్ ఆప్నియాతో బాధపడే వారిలో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం మాత్రమే కాదు సడెన్ డెత్స్ కూడా జరగవచ్చు. తాము గురక పెడతామో లేదో తెలిసిన వారు కొందరే ఉండవచ్చు. సాధారణంగా పార్ట్నర్స్ గురకను గుర్తిస్తారు. గురక ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురక కారణంగా నిద్రలో శ్వాస ఆగిపోవచ్చు.  


స్లీప్ ఆప్నియాకు సాధారణంగా రాత్రి పూట వేసుకునేందుకు ఒక మాస్క్ ఇచ్చి చికిత్స చేస్తారు. ఈ మాస్క్ శరీరంలోకి గాలి పంప్ చేస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవు. ఎయిర్ వేస్ తెరచుకొని ఉండేందుకు తోడ్పడుతాయి. కానీ చాలా మంది ఇవి వాడేందుకు ఇబ్బంది పడతారు. 


స్లీప్ ఆప్నియా లక్షణాలు



  • శ్వాసలో అంతరాయం ఏర్పడడం, తిరిగి ప్రారంభం కావడం

  • గురక వల్ల శ్వాస సరిగా ఆడకపోవడం వల్ల ఉక్కిరి బిక్కిరై మెలకువ రావడం

  • గట్టి శబ్ధంతో గురక

  • రాత్రి నిద్రాభంగం కావడం వల్ల పగలంతా కూడా అలసటగా ఉండటం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది.

  • తలనొప్పి తో నిద్ర లేస్తారు.


మీకు స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం అశ్రద్ధ తగదు. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, మెదడు సామర్థ్యం తగ్గిపోవడం వంటి పెద్ద పెద్ద సమస్యలతో దీనికి సంబంధం ఉండొచ్చని స్వీడన్ కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.