Jasprit Bumrah:


జస్ప్రీత్‌ బుమ్రా హుటాహుటిన న్యూజిలాండ్‌కు బయల్దేరుతున్నాడు. ఇబ్బంది పెడుతున్న వెన్నెముకకు అక్కడే శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని తెలిసింది. బీసీసీఐ, ఎన్‌సీఏ మేనేజర్లు నిపుణుడైన కివీస్‌ వైద్యుడిని ఇప్పటికే సంప్రదించారని సమాచారం. నడుం నొప్పి, వెన్నెముక గాయాలతో సతమతమైన జోఫ్రా ఆర్చర్‌కు అతడే నయం చేశాడు. అందుకే యుద్ధ ప్రాతిపదిన టీమ్‌ఇండియా పేసుగుర్రాన్ని ఆక్లాండ్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితులను బట్టి జస్ప్రీత్‌ బుమ్రా కనీసం 20 నుంచి 24 వారాలు క్రికెట్‌కు దూరమవుతాడు. అతడు కోలుకొనేందుకు చాలా సమయం పట్టనుంది. అంటే సెప్టెంబర్‌ వరకు అతడు బౌలింగ్‌ చేయలేడు. ఐపీఎల్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఆసియాకప్‌ టోర్నీలను ఆడే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనా అక్టోబర్‌ -నవంబర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు అతడిని సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.


బుమ్రాకు చికిత్స అందించే సర్జన్‌ పేరు రొవాన్‌ షూటెన్‌. ఆయన క్రైస్ట్‌చర్చ్‌లో ఉంటారని తెలిసింది. అర్థోపెడిక్స్‌లో రినోవ్‌డ్‌ సర్జన్‌ గ్రాహమ్‌ ఇంగ్లిస్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. షేన్‌ బాండ్‌ సహా ఎందరో కివీస్‌ క్రీడాకారులకు గ్రాహమ్‌ వైద్యం చేశారు. ముంబయి ఇండియన్స్‌కు బాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే షూటెన్‌ పేరును ఆయనే సూచించారని సమాచారం.


క్రీడాకారుల గాయాలు నయం చేయడంలో షూటెన్‌ది అందెవేసిన చేయి! ఒక క్రమ పద్ధతిలో ఆయన గాయాలను నయం చేస్తారని పేరుంది. ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌కు ఇంగ్లిస్‌ సర్జరీ చేస్తున్నప్పుడు షూటెన్‌ ఆయన సహాయకుడిగా ఉన్నారు. బెన్‌ డ్వారుషియిస్‌, జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌, జోఫ్రా ఆర్చర్‌ వంటి క్రికెటర్లు వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆయనే సర్జరీలు చేశారు. కాగా ఈ విషయంపై ఎన్‌సీఏ, బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.


Also Read: WPLలో ధోనీ, రోహిత్‌, కోహ్లీ లాంటి కెప్టెన్లు ఏ జట్లకున్నారో తెలుసా?


Also Read: అరగంటలో 6 వికెట్లు తీసిన యాష్‌, ఉమేశ్‌ - ఆసీస్‌ 197 ఆలౌట్‌


ఇప్పటికే ఆరు నెలలుగా బుమ్రా క్రికెట్‌ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్‌ నుంచి మైదానానికి దూరంగానే ఉన్నాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే ముందు జరిగిన శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఎదురవ్వడంతో అతడిని తప్పించారు. ప్రస్తుతం అతడు ఎన్‌సీఏలోనే రీహబిలిటేషన్‌లో ఉన్నాడు.


ఎన్‌సీఏ మైదానంలో పది రోజుల్లో బుమ్రా రెండు, మూడు మ్యాచులు ఆడాడని వార్తలు వచ్చాయి.  ఇందులో అతడు మెరుగ్గానే కనిపించాడని అంటున్నారు. అయినప్పటికీ ఎన్‌సీఏ మేనేజర్లు అతడికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అవ్వలేదు. దాంతో అతడు నేరుగా ఐపీఎల్‌ ఆడతాడని అన్నారు. సెప్టెంబర్లో ప్రపంచకప్‌ ఉండటంతో అతడిపై పనిభారం మెల్లగా పెంచాలని టీమ్‌ఇండియా యాజమాన్యం భావించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఇంతలోనే అనూహ్యంగా అతడు ఐపీఎల్‌, టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆసియాకప్‌నకు దూరమవుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో న్యూజిలాండ్‌కు పంపిస్తున్నట్టు తెలిసింది.