IND vs AUS 3rd Test:


ఇండోర్‌ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఉదయం టీమ్‌ఇండియా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్‌తో రవిచంద్రన్‌ అశ్విన్‌, రివర్స్‌ స్వింగ్‌తో ఉమేశ్‌ యాదవ్‌ కేవలం అరగంటలో 6 వికెట్లు పడగొట్టారు. 186/4తో గురువారం ఆట ఆరంభించిన ఆసీస్‌ను 76.3 ఓవర్లకు 197 స్కోరుకు ఆలౌట్‌ చేశారు. 88 పరుగుల ఆధిక్యానికి పరిమితం చేశారు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట మొదలు పెట్టిన పీటర్‌ హ్యాండ్స్‌ కాంబ్‌ (19), కామెరాన్‌ గ్రీన్‌ (21) ఎక్కువ బంతులే ఆడినా స్కోర్‌ చేయలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా భోజన విరామానికి వికెట్లేమీ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (5), శుభ్‌మన్‌ గిల్‌ (4) క్రీజులో ఉన్నారు.




బౌలింగ్‌ అదిరింది!


గురువారం ఉదయం క్రీజులోకి వచ్చిన హాండ్స్‌కాంబ్‌, కామెరాన్‌ గ్రీన్‌ ఆట చూస్తుంటే అంత సులభంగా ఔటయ్యేలా కనిపించలేదు. పైగా పేసర్లు విసిరిన బంతుల్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. గంట వరకు ఆచితూచి ఆడారు. జట్టు స్కోరు 186 వద్ద హాండ్స్‌కాంబ్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. టాసప్‌ అయిన బంతిని కాంబ్‌ ముందుకొచ్చి ఆడాడు. బ్యాటుకు తగిలిన బంతిని షార్ట్‌లెగ్‌లోని శ్రేయస్‌ అయ్యర్‌ చక్కగా ఒడిసిపట్టాడు. కీలక ఆటగాడు ఔటవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. మరో రెండు పరుగులకే కామెరాన్‌ గ్రీన్‌ను ఉమేశ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత అలెక్స్‌ కేరీ (3), మిచెల్‌ స్టార్క్‌ (1), నేథన్‌ లైయన్‌ (4), టార్‌ మర్ఫీ (0) ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు.




తొలిరోజు ఆసీస్‌ ఇన్నింగ్స్‌ తీరు


టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియాకు తేడా ఉస్మాన్‌ ఖవాజా (60; 147 బంతుల్లో 4x4)! స్పిన్‌ ఆడటంలో తిరుగులేదనుకున్న భారత ఆటగాళ్లు అదే స్పిన్‌ దెబ్బకు కుదేలయ్యారు. ఆతిథ్య జట్టులోనూ భయం ఉన్నా ఖవాజా ఆదుకున్నాడు. తిరుగులేని హాఫ్‌ సెంచరీ బాదేశాడు. మొదట్లోనే జడేజా బౌలింగ్‌ ఔటై నోబాల్‌తో బతికిపోయిన అతడు ఆ తర్వాత చెలరేగాడు. ఆసీస్‌కు అవసరమైన స్కోరు అందించాడు. జట్టు స్కోరు 12 వద్దే ట్రావిస్‌ హెడ్‌ (9) ఔటైనా మార్నస్‌ లబుషేన్‌ (31; 91 బంతుల్లో 4x4)తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. 108 వద్ద లబుషేన్‌ను జడ్డూ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే ఖవాజానూ అతడే పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ అండతో స్టీవ్‌స్మిత్‌ (26; 38 బంతుల్లో 4x4) సమయోచిత స్కోరు చేశాడు. జట్టు స్కోరు 146 వద్ద అతడిని జడ్డూ ఔట్‌ చేసి నాలుగో వికెట్‌ అందుకున్నాడు.