రాత్రి పూట తెలియని నొప్పి ఏదైనా వేధిస్తుంటే ఈ నొప్పిని నిర్లక్ష్యం చెయ్యకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ ఫాక్స్ ఆన్లైన్ ఫార్మసికి చెందిన డాక్టర్ డెబొరా లీ ఇలాంటి నొప్పుల గురించి కొన్ని ప్రత్యేక విషయాలను గురించి చర్చిస్తున్నారు. క్యాన్సర్ శరీరంలో పెరుగుతున్నపుడు రాత్రి పూట చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో క్యాన్సర్ చాలా వేగంగా పెరుగుతుందట.
పడుకుని ఉన్నపుడు క్యాన్సర్ కణితి బరువులో మార్పులు రావడం, పరిసరాల్లోని కణజాలాలకు వ్యాప్తి చెందడం వల్ల నొప్పి వస్తుందని డాక్టర్ లీ అంటున్నారు. అయితే ప్రతి నొప్పిని క్యాన్సరేమో అని భయపడాల్సిన పనిలేదని కూడా చెబుతూ నొప్పితో పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలను కూడా ఆమె వివరించారు.
- ఆకలి తగ్గిపోవడం
- అకారణంగా బరువుతగ్గడం
- తరచుగా అనారోగ్యం
- కారణం లేకుండా అలసట
- తరచుగా వికారంగా ఉండడం ఒక్కోసారి వాంతులు కావడం
- తరచుగా జ్వరం రావడం
పై లక్షాలతోపాటు ఏదైనా శరీర భాగంలో వివరించేందుకు వీలుకానీ నొప్పి ఏదైనా మూడు వారాలకు మించి బాధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలని డాక్టర్ లీ వివరించారు.
నొప్పి ఎందుకు?
శరీరంలోని ఎముకలు, నాడులు ఇలా ఏదైనా అవయవం మీద క్యాన్సర్ కణితికి సంబంధించిన ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. నొప్పి కొన్ని సార్లు క్యాన్సర్ చికిత్స వల్ల కూడా ఉంటుంది. ఉదాహారణకు కొన్ని రకాల కీమోథెరపీ మందుల వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్ల వంటి నొప్పి, జలదరింపులకు కారణమవుతాయి. కీమో మందుకు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్న చోట మంట వంటి నొప్పి కూడా టుంది.
ఏ రకమైన క్యాన్సర్, ఏభాగంలో ఏర్పడింది, అది ఏ దశలో ఉంది అనే దాని మీద ఆధారపడి నొప్పి ఉంటుంది. క్యాన్సర్ కానీ, లేదా చికిత్స వల్ల కానీ ఏవైనా నాడులు దెబ్బతిన్నాయా అనేది కూడా నొప్పికి కారణం అవుతుంది.
ఒక్కోసారి క్యాన్సర్ సోకిన భాగంలో కాకుండా మరేదో శరీర భాగంలో కూడా నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పిని రెఫరల్ పెయిన్ అంటారు. ఈ రెఫరల్ పెయిన్ ను ఊహించడం కష్టం ఉదాహారణకు లివర్ లో వాపు ఉంటే కుడి భుజంలో నొప్పి రావచ్చు. ఎందుకంటే పరిమాణంలో పెరిగిన లివర్ కుడిభుజంలోని నాడి మీద ఒత్తిడి పెంచుతుంది.
క్యాన్సర్ అంటేనే బాధ, నొప్పి. అది ఏవిధంగా ఉంటుందనేదాన్ని ఊహించడం కష్టం. కొన్ని నొప్పులు జబ్బు వల్ల అయితే మరికొన్ని నొప్పులు చికిత్స వల్ల కావచ్చు. అయితే నొప్పి వచ్చిన ప్రతి సారీ క్యాన్సరేమో అని బెంబెలెత్తే పనిలేదు. నొప్పితో పాటు ఉండే ఇతర లక్షణాల గురించి అవగాహాన కలిగి ఉంటే ఇలాంటి భయాలకు తావుండదని నిపుణుల ఉద్దేశ్యం.
Also read : రాత్రి భోజనంలో ఇవి మానెయ్యండి, గురక సమస్య తీరుతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.