అబ్స్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటే గురక వల్ల నిద్రలో శ్వాసకు అంతరాయం కలగడం. ఈ సమస్య వల్ల మరింత గట్టిగా ఊపిరి పిల్చాల్సి వస్తుంది. శ్వాసలో అంతరాయం వల్ల ఆక్సిజన్ తగినంత అందకపోవడం వల్ల రకరకాల ప్రాణాంతక అనారోగ్యాలకు కారణం అవుతుంది. గురక పెట్టే వారందరికీ ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు. ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన మార్పుల వల్ల కూడా కొంత ఫలితం ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి పూట తినడం మానేస్తే నిద్రలో గురక పెట్టడం తగ్గుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
డైరీ ఉత్పత్తులు
నిద్ర పోవడానికి ముందు పెరుగు, జున్ను, ఐస్ క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఇవి రాత్రి వేళల్లో తీసుకుంటే గురక సమస్య ఎక్కువ అవుతుంది. డైరీ ఉత్పత్తుల్లో ఉండే లాక్టోజ్ గురకను ఎక్కువ చేసే శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. కనుక గురక ఎక్కువగా వస్తుంది.
తీపి పదార్థాలు, పానీయాలు
ఎవరైనా సరే చక్కెర తగ్గించి తీసుకోవడమే మంచిది. తీపి ఎక్కువ తినడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం, కాలేయ, హృదయ సంబంధ వ్యాధులకు కారణం అవుతాయి. అంతేకాదు గురక పెట్టే వారిలో ఈ సమస్య కూడా పెరిగిపోతుంది. ప్రాసెస్ చేయబడిన చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ముక్కు భాగాలలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అందుకే సాయంత్రం పూట స్వీట్లు, కుకీలు, డెజర్టులు, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు.
గోధుమ
ప్రాసెస్ చేసిన గోధుమలు, గోధుమ పిండి తో చేసిన పదార్దాలు తీసుకోవడం వల్ల శ్వాసనాళాలు, సైనస్ లలో ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఫలితంగా గురక సమస్య మరింత ఎక్కువ అవుతుంది. గోధుమ పిండితో తయారయ్యే ఉత్పత్తుల వాడకం శ్లేష్మాన్ని పెంచుతాయి. గోధుమల్లో ఉండే గ్లుటెన్ వల్ల శ్లేష్మం పెరగవచ్చు. కనుక గ్లుటేన్ ఫ్రీ పదార్థాలను ఎంచుకోవాలి.
మాంసాహారం
కొవ్వు, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే మాంప పదార్థాల వల్ల కూడా గురక పెరుగుతుంది. సంతృప్త కొవ్వులు కఫ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అందుకే రాత్రి భోజనంలో మాంసం తీసుకోక పోవడమే మంచిది. కూరగాయలు, పండ్లు, సాల్మన్, గింజధాన్యాలు, అవకాడోలు, ఆలీవ్ నూనె వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలను వినియోగించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
ఫాస్ట్ ఫూడ్
ఫాస్ట్ ఫూడ్ ఆరోగ్యానికి ఏరకంగానూ మంచిది కాదు కనుక వీలైనంత వరకు అధికంగా ప్రాసెస్ చేసిన పదార్థాల వినియోగం పూర్తిగా మానేస్తే గురక సమస్యను కొంత వరకు అదుపు చెయ్యడం సాధ్యపడుతుంది. ఫాస్ట్ ఫూడ్ వల్ల అజర్తి సమస్య కూడా రావచ్చు. ఫలితంగా నిద్రాభంగం లేదా గురక వంటి సమస్యలు అధికమవుతాయి. కనుక వీలైనంత వరకు ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫూడ్ కు దూరంగా ఉండాలి.
ఇలా ఆహార విహారాల్లో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల స్లీప్ ఆప్నియా సమస్యను కొంత వరకు అదుపు చెయ్యడం సాధ్యపడుతుంది.
Also read : రాత్రిపూట స్నానం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.