Cyclone Biparjoy Update: బిపర్జోయ్ తుపాన్ గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ తీరాన్ని గురువారం (జూన్ 15) రాత్రి 11.30 గంటలకు తాకింది. తీరాన్ని తాకిన తర్వాత తుపాను వేగం క్రమంగా తగ్గుతూ వస్తోంది. జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈ తుపాను రాజస్థాన్ వైపు కదులుతోంది. ఇక్కడ గాలుల వేగం గంటకు 75 నుంచి 85 కిలోమీటర్లు ఉంది.
తుపాను కారణంగా నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కచ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సౌరాష్ట్ర, కచ్‌లో శుక్రవారం (జూన్ 16) భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాను కారణంగా రాగల 4 రోజులపాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
కచ్ జిల్లాలోని జాఖౌ, మాండ్విలో బిపర్జోయ్ బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, ఇంటి నిర్మాణంలో ఉపయోగించే వస్తువులు ఎగిరిపోయాయి. ద్వారకలో చెట్లు కూలడంతో ముగ్గురికి గాయాల్యాయి. గుజరాత్ పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ బృందాలు ద్వారకాలోని వివిధ ప్రాంతాల్లో నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించే పనిలో ఉన్నారు.
భుజ్, జామ్నగర్, గాంధీధామ్‌తోపాటు నలియా, ద్వారకా, మాండ్విలోని ప్రాంతాల్లో 27 సహాయక దళాలు మోహరించాయి. వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీలో ఒక్కో హెలికాప్టర్ను ఐఏఎఫ్ సిద్ధంగా ఉంచింది. ఓఖా, పోర్ బందర్, బకాసూర్‌లో సహాయక చర్యల కోసం నేవీ 10-15 బృందాలను రంగంలోకి దింపింది. ఒక్కో టీంలో ఐదుగురు డైవర్లు ఉన్నారు. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ శుక్రవారం బలమైన గాలులు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది.
99 రైళ్లు రద్దు
గుజరాత్‌లోని చాలా జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. మాండ్విలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అరేబియా సముద్రం నుంచి దూసుకొచ్చిన బిపర్జోయ్ తుపాను ప్రభావం వల్సాద్‌లో కూడా కనిపిస్తోంది. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్‌లో సముద్రపు అలల తాకిడికి ఓ ఇల్లు కూలిపోగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బైపర్జోయ్ ప్రభావం రైలు సర్వీసులపై కూడా కనిపించింది. ఈ నెల 18వ తేదీ వరకు 99 రైళ్లను రద్దు చేశారు. తుపాను కారణంగా ఇప్పటివరకు 22 మంది గాయపడ్డారని, 23 పశువులు మృతి చెందాయని గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు.
బిపర్జోయ్ తుపాన్ ఈశాన్య దిశగా పయనించి పాకిస్తాన్ తీరాన్ని ఆనుకుని ఉన్న సౌరాష్ట్ర-కచ్‌ను దాటిందని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం సముద్రం నుంచి భూమిపైకి వచ్చిన తుపాను సౌరాష్ట్ర-కచ్ దిశలో కేంద్రీకృతమైంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి తుపాను వాయుగుండంగా మారుతుందని తెలిపారు
Also Read: నేడు తేలికపాటి జల్లులకు ఛాన్స్! బిపార్జోయ్ తుపాను బీభత్సం ఎలా ఉందంటే?