గుజరాత్ తీరంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం మొదలైంది. తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల తదుపరి 5 గంటల పాటు అంటే అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. తుపాను ప్రభావం గుజరాత్ తీర ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గుజరాత్‌ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కచ్‌లోని మాండ్వి ప్రాంతంలో రోడ్లపై హోర్డింగ్‌లు, చిన్న నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. నలియా జఖౌ హైవేపై పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో హైవే మూసుకుపోయింది. భారత వాతావరణ శాఖ ప్రకారం..  ఈ సమయంలో తుఫాను వేగం గంటకు 15 కి.మీ.


ప్రస్తుతం గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.


ఆ ప్రాంతంలో విద్యుత్ కోత


కచ్‌లోని మాండ్విలో, జిల్లా అధికారులు 300 కంటే ఎక్కువ బృందాలు ఏర్పాటు చేశాయి. ఇవి ఆ ప్రాంతంలో విద్యుత్‌ను పునరుద్ధరించడానికి పని చేస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. తుపాను తీరం దాటిపోయి పరిస్థితి సాధారణ స్థితికి వస్తే, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయవచ్చు.


అర్ధరాత్రి 11.30 సమయంలో బిపోర్జాయ్‌ తుపాను పూర్తిగా తీరం దాటే  అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత అది తీవ్ర తుపానుగా, ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుంది. దీని ప్రభావంతో కచ్‌-సౌరాష్ట్ర ప్రాంతాలు, పోర్‌బందర్‌, ద్వారక, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, జునాగఢ్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల  మేర ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చినట్లు ఐఎండీ వెల్లడించింది.


ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు - హర్ష్ సంఘ్వీ


గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బిపార్జోయ్ రాత్రిపూట తీరాన్ని తాకడం వల్ల భద్రతా ఏజెన్సీలకు సవాలును పెంచింది. ఈదురు గాలులతో కచ్‌లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. మాండ్విలోని మారిటైమ్ బోర్డు కార్యాలయం ధ్వంసమైంది. కచ్‌లో పలు చెట్లు నేలకూలాయి. రెండు ట్రాన్స్‌ఫార్మర్లు సహా 60 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ శుక్రవారం కూడా మూసివేయబడుతుంది. సబర్మతి రివర్ ఫ్రంట్‌లోని అటల్ వంతెన కూడా మూసివేయబడుతుంది.


మొత్తం 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్ లతోపాటు రోడ్లు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ దళాలను కూడా రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు.