Sovereign Gold Bond Scheme: బంగారాన్ని చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(RBI) ఒక సువర్ణావకాశం తీసుకొచ్చింది. RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గం ఇది.


సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 మొదటి సిరీస్‌ ఈ నెల 19వ తేదీ (2023 జూన్‌ 19) నుంచి ప్రారంభం అవుతుంది, జూన్ 23 వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 రెండో సిరీస్ సెప్టెంబర్‌లో జారీ చేస్తారు.


సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి?
బంగారాన్ని భౌతిక రూపంలో ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకనే వాళ్లు ఈ గోల్డ్‌ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు.


ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి 8 సంవత్సరాలు. అయితే గోల్డ్ బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజు ఉన్న రేటుకు బాండ్లను అమ్మవచ్చు.


SGB ఇష్యూ ధర ఎంత?
సబ్‌స్క్రిప్షన్ తేదీకి ముందున్న మూడు పని దినాల్లో, 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఇష్యూ ధరను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా బాండ్లను కొంటే గ్రాముకు రూ. 50 డిస్కౌంట్‌ లభిస్తుంది.


సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి?
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందవచ్చు.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.


సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు.


ఎంత బంగారం కొనవచ్చు?
గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.


మరో ఆసక్తికర కథనం: పాన్‌-ఆధార్‌ లింకింగ్‌పై IT డిపార్ట్‌మెంట్‌ ట్వీట్‌, త్వరపడకపోతే మోత మోగుద్ది