What is Form-16: ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫైలింగ్‌ ప్రారంభమైంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇప్పటికే ఫామ్‌-16 జారీ చేశాయి. జీతం రూపంలో ఆదాయం పొందే పన్ను చెల్లింపుదార్లకు ఇది చాలా కీలక డాక్యుమెంట్‌. ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ (ITR Filing) చేసే సమయంలో ఫామ్‌-16 బాగా ఉపయోగపడుతుంది, అసెసీ పనిని సులభం చేస్తుంది.


ఫామ్-16 అంటే ఏమిటి?
ఫారం-16 అనేది పర్సనల్‌ డాక్యుమెంట్‌. ప్రతి ఉద్యోగికి ఎవరి ఫామ్‌-16 వాళ్లకు అందుతుంది. ఇందులో, ఆ ఎంప్లాయీకి చెందిన ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఉద్యోగికి ఇచ్చిన జీతం (salary), ఉద్యోగి క్లెయిమ్ చేసిన తగ్గింపులు (Deductions), కంపెనీ యాజమాన్యం తీసివేసిన TDS (Tax Deducted At Source) సమాచారం ఇందులో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం, కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 ఇవ్వడం తప్పనిసరి. అందులో, ఉద్యోగి ఆదాయంపై మినహాయించిన TDS పూర్తి వివరాలు ఉంటాయి.                      


కంపెనీలు ఫారం-16 ఇవ్వడం ప్రారంభించాయి. మీకు ఇప్పటికీ అది అందకపోతే, అతి త్వరలోనే పొందే అవకాశం ఉంది. ఫామ్‌-16 పొందిన తర్వాత, ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి తాత్సారం చేయకూడదు. ఈసారి ITR దాఖలుకు 2023 జులై 31 వరకు గడువు (ITR Filing Deadline) ఉంది. మీరు ఎలాంటి ఫైన్‌ చెల్లించాల్సిన అవసరం లేకుండా 31 జులై 2023 వరకు ఆదాయపు పన్ను పత్రాలు సబ్మిట్‌ చేయవచ్చు. చివరి రోజుల్లో పోర్టల్‌లో రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తడం గతంలో చాలాసార్లు కనిపించింది. కాబట్టి, తుది గడువు వచ్చే వరకు వేచి ఉండటం సరికాదు.                           


జీతభత్యాల వివరాలను తనిఖీ చేయండి
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే ముందు, ఫామ్‌-16ని క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. మీ జీతంభత్యాలు మీ ఫామ్-16లో సరిగ్గా చూపారో, లేదో తనిఖీ చేయండి. ఆ వివరాల్లో... హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అసిస్టాన్స్ ‍‌(LTA) ముఖ్యమైనవి. అవే కాదు, ITR నింపే ముందు ఈ 5 విషయాలను కూడా తనిఖీ చేయడం అవసరం.


ఈ 5 విషయాలపైనా శ్రద్ధ పెట్టండి         
మీ పాన్ నంబర్ సరిగా ఉందో, లేదో చెక్ చేసుకోండి. అందులో ఒక్క డిజిట్‌ తప్పుగా ఉన్నా TDS క్లెయిమ్ చేయలేరు.
ఫారం-16లో మీ పేరు, చిరునామా, కంపెనీ TAN నంబర్‌ను తనిఖీ చేయండి.
ఫామ్-16లో కనిపించే పన్ను మినహాయింపు వివరాలన్నీ ఫామ్-26AS & AISతో సరిపోవాలి.
మీరు పాత పన్ను విధానాన్ని  (Old Tax Regime) ఎంచుకున్నట్లయితే, పన్ను ఆదా చేసే డిడక్షన్స్‌ వివరాలను తనిఖీ చేయండి.
మీరు 2022-23లో ఉద్యోగాలు మారినట్లయితే, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్-16ని ఖచ్చితంగా తీసుకోండి.


మరో ఆసక్తికర కథనం: క్రిప్టో మార్కెట్లో రక్త కన్నీరు! బిట్‌కాయిన్‌ రూ.98వేలు లాస్‌!