Income Tax Filing: 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌కు (2023-24 అసెస్‌మెంట్ ఇయర్) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సీజన్ ఇది. పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ప్రస్తుతం ఐటీ రిటర్న్ ఫైల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన అన్ని ఫారాలు ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఇప్పటికే ఫామ్-16 అందించాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆలస్యమైతే, మరికొన్ని రోజుల్లోనే ఫామ్-16లు అందరికీ అందుతాయి. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి 2023 జులై 31వ తేదీ లోపు టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి.
కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఒకే ఆఫీస్‌లోనే ఉంటారు. మరికొంతమంది వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు మారతారు. గత ఆర్థిక సంవత్సరం (01 ఏప్రిల్ 2022 - 31 మార్చి 2023) మధ్యలో ఉద్యోగం మారని వాళ్లకు టాక్స్ రిటర్న్ ఫైలింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పటిలాగే ITR (Income tax return) పైల్ చేయాలి. గత ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వాళ్లు, తమ ఆదాయ వివరాలు ప్రకటించే సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, అన్ని కంపెనీల నుంచి ఫామ్-16 తీసుకోవాలి. అంటే, ప్రస్తుత కంపెనీ నుంచి ఫామ్-16 తీసుకోవాలి, పాత కంపెనీల నుంచి కూడా సేకరించాలి. ఈ మొత్తం వివరాలతో రిటర్న్ ఫైల్ చేయాలి.
ఇన్‌కం టాక్స్ ఫామ్-12B &12BA
ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వాళ్లకు "ఇన్‌కం టాక్స్ ఫామ్-12B, 12BA" వర్తిస్తాయి. పాత కంపెనీ నుంచి మీరు సంపాదించిన జీతం, TDS వివరాలను కొత్త కంపెనీకి వెల్లడించేదే ఫామ్-12B. కంపెనీ మారిన ప్రతి కొత్త ఉద్యోగి మార్చి 31వ తేదీ ముందు వరకు చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన రుజువులను కూడా కొత్త యాజమాన్యానికి సబ్మిట్ చేయాలి. దీనివల్ల, ప్రస్తుత యజమాన్యం మీ జీతంలో ఒకే కటింగ్ రెండోసారి రిపీట్ కాకుండా చూస్తుంది. ఫలితంగా మీకు జీతం నష్టం ఉండదు.
ఇన్‌కం టాక్స్ ఫామ్-12BAను కూడా కొత్త కంపెనీకి సదరు ఉద్యోగి సమర్పించాలి. ఇందులో, పాత కంపెనీ అందించిన నజరానాల వివరాలు ఉంటాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు, హోదా ఆధారంగా జీతానికి అదనంగా కొన్ని బెనిఫిట్స్ అందిస్తాయి. వాటిని పెర్క్విసైట్స్ లేదా పెర్క్స్ (Perquisites or Perks) అని పిలుస్తారు. ఈ ప్రయోజనాలు నగదు రూపంలో, లేదా ఇతర రూపాల్లో ఉండవచ్చు. ఉదాహరణకు... ఉద్యోగి పిల్లలకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, వడ్డీ లేని రుణం, హెల్త్ ఫెసిలిటీ, క్రెడిట్ కార్డ్, అద్దె లేని ఇల్లు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ప్లాన్ (ESOP) వంటివి. ఒకవేళ సదరు ఉద్యోగి వీటికి డబ్బు చెల్లించినా, కంపెనీ అతనికి రిఫండ్ చేస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఫామ్-12BAలో ఉంటాయి. కాబట్టి, ఈ ఫారాన్ని కూడా సదరు ఉద్యోగి కొత్త కంపెనీకి సబ్మిట్ చేయాలి. దీనివల్ల, ఆ వివరాలన్నింటినీ కొత్త కంపెనీ తాను ఇచ్చే ఫామ్ 16లో పొందుపరుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: కొండ దిగిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు