దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ మరియు  వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూన్ 15) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో  వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, కొత్త గూడెం,సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో  వడగాలులు వీచే అవకాశం ఉంది 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 56 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఏపీలోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో వడగాలులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాడ్పులు కొన్ని ప్రాంతాల్లో రానున్నాయి. వీటిలో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం కాస్త తీవ్ర స్థాయిలోనే (ఆరెంజ్ అలర్ట్) వడగాడ్పులు వీయనున్నాయని అధికారులు అంచనా వేశారు.


అంతేకాకుండా ఈ తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయని, బలమైన గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో వీస్తాయని వెల్లడించారు. 


బిపర్‌జోయ్ తుపాను అప్ డేట్స్


అరేబియా సముద్రంలో కల్లోలం రేపుతున్న బిపర్జోయ్ తీవ్ర తుఫాను ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ అరేబియా సముద్రంలో ఏర్పడి నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. జూన్ 15న అతి తీవ్రమైన తుఫానుగా సౌరాష్ట్ర-కచ్, ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరానికి చేరుకునేందుకు బలమైన అవకాశం ఉంది. ఆ తర్వాత అది ఈశాన్య దిశగా వెళ్లి క్రమంగా బలహీనపడుతుంది.
 
తీరాన్ని తాకిన బిపార్జోయ్ తుపాను
గుజరాత్ తీరంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం మొదలైంది. తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల తదుపరి 5 గంటల పాటు అంటే అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. తుపాను ప్రభావం గుజరాత్ తీర ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గుజరాత్‌ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కచ్‌లోని మాండ్వి ప్రాంతంలో రోడ్లపై హోర్డింగ్‌లు, చిన్న నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. నలియా జఖౌ హైవేపై పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో హైవే మూసుకుపోయింది. భారత వాతావరణ శాఖ ప్రకారం..  ఈ సమయంలో తుఫాను వేగం గంటకు 15 కి.మీ.


ప్రస్తుతం గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.