సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఒక పక్క ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూనే ఉంది, అయినా సిగరెట్ కాల్చేవారి సంఖ్య పెరుగుతుంది కానీ తరగడం లేదు. సిగరెట్ కాల్చేవారే కాదు, వారి పక్కన నిల్చుని ఆ పొగ పీల్చేవారిలో కూడా ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు సిగరెట్ల వల్ల త్వరగా, అది కూడా తీవ్రంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సిగరెట్లో ఉన్న నికోటిన్ చాలు వారి మెదడును అనారోగ్యం పాలు చేయడానికి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఒక్క సిగరెట్లో ఉన్న నికోటిన్ శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయకుండా మహిళల మెదడును అడ్డుకుంటుంది. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆడవారిలో ప్రవర్తనా పరమైన సమస్యలు మొదలవుతాయి.
అధ్యయనం ఇలా...
స్వీడన్లోని ఉప్ప్సలా యూనివర్సిటీలో ప్రధాన పరిశోధకురాలు ఎరికా కొమాస్కో మాట్లాడుతూ ‘నికోటిన్ మహిళల మెదడులో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి యంత్రాంగాన్ని మూసివేసేలా చేస్తుంది. ఇంత ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసి మేము ఆశ్చర్యపోయాము. ఒక సిగరెట్లో ఉన్న నికోటిన్ స్త్రీ మెదడు పై శక్తివంతంగా పనిచేస్తోంది. ఇది కొత్తగా బయటపడిన విషయం’ అని చెప్పారు. ముఖ్యంగా నికోటిన్ మహిళల మెదడులోని థాలమస్ అనే భాగంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్టు గుర్తించారు. ఇదే ప్రవర్తన, భావోద్వేగాలను నియంత్రించే ప్రాంతం. దీనిపై ప్రభావం చూపించడం వల్ల మహిళలే ప్రవర్తనే మారిపోతుంది. ఈ అధ్యయనం ఆరోగ్యవంతమైన పదిమంది మహిళలపై చేశారు. వారికి నికోటిన్ ఇచ్చి పరిశోధనలు చేశారు. ఆరోమాటేస్ అనేది మహిళల్లో ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేసే ఎంజైమ్. అయితే నికోటిన్ ఇచ్చాక మహిళల మెదడుకు స్కాన్ చేసి చూశారు. పరిశోధనలు చేశారు. అందులో నికోటిన్ మూలంగా మెదడులో ఆరోమాటేస్ మొత్తం తగ్గడం గుర్తించారు. ఈ ఎంజైమ్ తగ్గడం వల్ల ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గుతోందని గుర్తించారు.
పురుషుల్లో...
నికోటిన్ పురుషులపై, మహిళలపై భిన్నంగా పనిచేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే అబ్బాయిల మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశోధించలేదు. కానీ వెంటనే ప్రభావం చూపేది మాత్రం మహిళలపైనే అని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ధూమపానం కారణంగా హార్మోన్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు.
మహిళలు ధూమపానానికి దూరంగా ఉండడమే మంచిదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు, లేకుంటే అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని అంటున్నారు.
Also read: దేశంలోకి అడుగుపెట్టిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7, ఇది ప్రమాదకరమైనదే అంటున్న ఆరోగ్యనిపుణులు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.