కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. చైనాలో కోవిడ్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతుంది. హాస్పిటల్స్ లో ఎటు చూసినా కోవిడ్ పేషెంట్స్ తో కిక్కిరిసిపోతుంది. ఆ దేశ పరిస్థితి చూసి ఇతర దేశాలు గడగడలాడిపోతున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిస్థితి తీవ్రమవకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ విజృంభించడంతో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
భారత్ లో ఒమిక్రాన్ BF.7 కేసులు
చైనాలో ఒమిక్రాన్ కేసులతో పాటు భారత్ లోనూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. BF.7 అనేది ఒమిక్రాన్ వేరియంట్ BA.5 ఉప వేరియంట్. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం గుజరాత్ లో రెండు, ఒడిసాలో రెండు కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ BF.7 లక్షణాలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త వేరియంట్ లోని లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్‌ను పోలి ఉంటుంది.
⦿ జ్వరం
⦿ గొంతు మంట
⦿ ముక్కు కారడం
⦿ దగ్గు
⦿ జలుబు, ఫ్లూ
⦿ కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి
⦿ అతిసారం
భారత్ లో ఇప్పటి వరకు ఎక్కువ కేసులు నమోదు కాకపోయినప్పటికి కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే కోవిడ్ సోకిన వారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే టీకాలు వేసిన వ్యక్తులకి కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం కోవిడ్ 19 వైరస్ కంటే BF.7 వేరియంట్ 4.4 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉందని వెల్లడించింది.
కొత్త వేరియంట్ ని అడ్డుకునేందుకు మునుపటి కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని RO విలువ 10-18.6 వరకు ఉంది. అంటే వైరస్ సోకిన వ్యక్తి తనతో పాటు 10-18.6 మంది దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ రేటు వేగంగా ఉంది. ఇది RT-PCR పరీక్షలలో గుర్తించడం కష్టంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. టీకాలు వేసుకొని, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
☀ వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం
☀ బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
☀ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేతులు కడుక్కోవాలి
☀ రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి
☀ టీకా, బూస్టర్ డోస్ లు వేయించుకోవాలి
☀ శానిటైజర్లు వాడాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు
Also Read: ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే పవర్ ఫుల్ డికాషన్ ఇదే, ఇలా తయారు చేయండి