Obesity: అధిక బరువు, ఊబకాయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న ఉద్యోగులు సరిగా పనిచేయలేరు. వారి ఉత్సాదకత తక్కువగా ఉంటుంది, ఇది కంపెనీల ఖర్చులను పెంచుతుంది. ఊబకాయం ఉన్నవారు త్వరగా అనారోగ్యాలకు గురవుతారని, దీనివల్ల సెలవులు అధికంగా పెడతారని, వారు ఉత్పాదకత తక్కువ అవుతుందని ఈ అధ్యయనం సారాంశం. అమెరికాలోని చికాగోకు చెందిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించారు పరిశోధకులు.
ఊబకాయం అనేది అమెరికాలో అతి పెద్ద సమస్య. దాదాపు 42 శాతం మంది ఊబకాయంతో అక్కడ బాధపడుతున్నారు. అధిక బరువు ఉన్న వ్యక్తులు త్వరగా టైప్2 డయాబెటిస్, హైబీపీ, గుండె వ్యాధులు, స్లీప్ ఆప్నియా, క్యాన్సర్ వంటి రోగాల బారిన త్వరగా పడే అవకాశం ఉంది. దీనివల్ల వారు సరిగా పనిచేయలేరు. ఉద్యోగానికి హాజరయ్యే రోజులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వారి ఉత్సాదకత తగ్గుతుంది. ఇది కంపెనీకి నష్టాలను తెచ్చిపెడుతుంది అని అధ్యయనకర్తల్లో ఒకరైన ఎలి లిల్లీ తెలిపారు.
ఈ అధ్యయనం ఉద్యోగుల బరువు కూడా వారి పనితీరుపై ప్రభావం చూపిస్తుందని తెలిసింది. అధిక బరువు అనేది ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ఇది కచ్చితంగా కంపెనీలు కూడా పట్టించుకోవాల్సిన విషయమేనని అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనలో భాగంగా 7,19,482 మంది ఉద్యోగులను పరిశోధకులు విశ్లేషించారు. వీరంతా కూడా అధిక బరువుతో బాధపడుతున్న వారే. వారు తరచూ ఎంతగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు? ఎన్ని రోజులు ఆఫీసుకి వెళతారు? ఎన్ని రోజులు సెలవు తీసుకుంటారు? అనే వివరాలను సేకరించి, వారి ఉత్పాదకతను అంచనా వేశారు. ఇతర ఉద్యోగులతో పోలిస్తే అధిక బరువు ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది.
ఊబకాయం నేటి తరాన్ని పీడిస్తున్న ఒక అతిపెద్ద ఆరోగ్య సమస్య. ప్రపంచంలో ఊబకాయం బారిన పడిన వారి జనాభా అధికంగా ఉన్న దేశం అమెరికా. ఇక రెండో స్థానంలో చైనా ఉంది. భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. రాబోయే కాలంలో అమెరికా, చైనాలను దాటి మన దేశం ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. చెడు జీవనశైలి, జంక్ ఫుడ్ అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి కారణంగా ఎక్కువమంది అధిక బరువు బారిన పడుతున్నారు. ఇక ఊబకాయం జన్యుపరంగా కూడా వస్తుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అలా జన్యుపరంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒత్తిడి కారణంగా కూడా కొంతమంది బరువు పెరిగిపోతారు. పురుషుల నడుము చుట్టుకొలత 102 సెంటీమీటర్లు దాటితే వారు ఊబకాయం బారిన పడినట్టే లెక్క. అదే స్త్రీల నడుము చుట్టుకొలత 88 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉంటే స్థూలకాయంతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయినట్టే.
Also read: గుండె కొన్ని క్షణాలు ఆగిపోయి, మళ్లీ కొట్టుకునే వ్యాధి ఇది
Also read: ఇక్కడున్న అంకెల్లో తేడాగా ఉన్న అంకె ఎక్కడుందో కనిపెట్టండి, అది కూడా పది సెకన్లలో...
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.