ITR Filing Mistakes: వ్యక్తిగత ఆదాయాల ప్రకటన ప్రారంభమైంది. టాక్స్‌పేయర్లు ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేస్తున్నారు. కంపెనీలు కూడా ఫామ్-16 జారీ చేస్తుండడంతో, ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ల సంఖ్య ప్రస్తుతం భారీగా పెరిగింది. టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31, 2023.
రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎక్కువ మంది కొన్ని కామన్ తప్పులు చేస్తున్నారు. మనం చేసే చిన్న పొరపాటు/నిర్లక్ష్యం వల్ల అనవసరంగా ఐటీ డిపార్ట్‌మెంట్ దృష్టిలో పడతాం, నోటీస్ అందుకోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది వద్దనుకుంటే, ఎక్కువ మంది చేస్తున్న తప్పులేంటో తెలుసుకుని, మీరు వాటికి దూరంగా ఉండాలి.
1. సరైన ITR ఫామ్ ఎంచుకోకపోవడం
ఒక వ్యక్తి సంపాదన, ఆదాయం, పన్ను విధించదగిన ఆదాయం ఆధారంగా ఇన్‌కం టాక్స్ ఫామ్ ఎంచుకోవాలి. ITR-1 నుంచి ITR-4 వరకు ఉన్న ఫామ్స్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం నిర్దేశించారు. మీ ఆదాయం సంవత్సరానికి 50 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే, మీరు ఆదాయపు పన్ను ఫామ్-1 ఎంచుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీలు, ఇతర పెట్టుబడుల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నా ఇదే ఫామ్ ఫైల్ చేయాలి. సరైన ఆదాయపు పన్ను ఫామ్ ఎంచుకోకపోతే, ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. తప్పుడు ఫారాన్ని టాక్స్ డిపార్ట్‌మెంట్ తిరస్కరిస్తుంది. 15 రోజుల లోపు మళ్లీ సరైన ఫారం పూర్తి చేసి, సమర్పించాలి. పదేపదే తప్పులు చేస్తే IT నోటీసును, పెనాల్టీని భరించాల్సి వస్తుంది.
2. ఫామ్-16, ఫామ్-26AS తనిఖీ చేయకపోవడం
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు, తప్పనిసరిగా ఫారం 26AS, ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను (AIS) తనిఖీ చేయాలి. ఇందులో, TDS, ఇతర ఆదాయాల గురించిన సమాచారం ఉంటుంది. దానిని ఫామ్-16తో సరిపోల్చాలి. ఆ ఫారాల్లో TDS సంబంధిత తప్పు లేదా తేడా కనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
3. వడ్డీ ఆదాయాలను వెల్లడించకపోవడం
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు, చాలా మంది పన్ను చెల్లింపుదార్లు చేసే కామన్ మిస్టేక్ ఇది. బ్యాంకులు & పోస్టాఫీసుల్లో పెట్టిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ గురించి సమాచారం ఇవ్వరు, లేదా మర్చిపోతుంటారు. దీనివల్ల తరువాత ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ తప్పు చేయకూడదనుకుంటే, రిటర్న్ దాఖలుకు ముందే, ఫామ్ 26S & AISను క్రాస్-చెక్ చేయాలి.
4. మూలధన లాభాలను చెప్పకపోవడం
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి వాటి ద్వారా ఆర్జించిన లాభాలను మూలధన లాభాలుగా (Capital gain) పిలుస్తారు. అసెట్ క్లాస్‌ను బట్టి వీటిపై 15% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ITR సమర్పించే సమయంలో ఇలాంటి ఆదాయాలకు సంబంధించిన సమాచారం వెల్లడించడం తప్పనిసరి. దీర్ఘకాలిక లాభాల మీద 20 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
5. పాత సంస్థ నుంచి వచ్చిన ఆదాయం
ఒకవేళ, ఒక వ్యక్తి ఉద్యోగం మారిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు, 2023 ఆర్థిక సంవత్సరంలో (2022 ఏప్రిల్ 1 - 2023 మార్చి 31 మధ్య కాలంలో) ఉద్యోగం/ఉద్యోగాలు మారినట్లయితే, మీ ప్రస్తుత కంపెనీతో పాటు, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్ 16 తీసుకోవాలి. దీంతో, మీ పాత ఉద్యోగం & TDS గురించి సమాచారం లభిస్తుంది. దీనివల్ల IT డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వంటి సమస్య తప్పుతుంది.
6. బ్యాంక్ వివరాలు తప్పుగా ఇవ్వడం
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు బ్యాంకు వివరాలపై చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు, టాక్స్‌పేయర్లు బ్యాంకు వివరాలను సరిగ్గా నింపరు. బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSCలో ఒక్క అంకెను తేడాగా రాసినా మీకు రావలసిన ప్రయోజనాలు ఆగిపోతాయి. పైగా, ఆదాయపు పన్ను నోటీసును అందుకోవాల్సి వస్తుంది.
7. చివరి నిమిషంలో ITR దాఖలు
కొంతమంది, రిటర్న్ దాఖలు చేయాల్సిన లాస్ట్ డేట్ వరకు పట్టించుకోరు, ఆఖరి రోజున హడావిడి చేస్తారు. అలాంటి పరిస్థితిలో, తొందరపాటు కారణంగా తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా, ఆదాయపు పన్ను నోటీసును ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, మీ పని ఎలాంటి సమస్య లేకుండా, సౌకర్యవంతంగా పూర్తి కావాలంటే చివరి రోజు వరకు వెయిట్ చేయవద్దు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' HDFC AMC, IIFL Securities
Join Us on Telegram: https://t.me/abpdesamofficial