Chanakya Niti: చాణక్య నీతిలో, మానవ జీవితాన్ని సరళంగా మార్చుకోవడానికి, విజయవంతంగా గడపడానికి అనేక సూత్రాలు ప్రస్తావించారు. చాణక్యుడి అనేక బోధనలలో ఒకదానిలో, మానవులను పరీక్షించడానికి ఒక మార్గాన్ని సూచించాడు. ఆచార్య చాణక్యుడి ఈ సూత్రం ప్రకారం, బంగారాన్ని సానపట్టాలి, కత్తిరించాలి, అగ్నిలో వేడి చేసి పరీక్షించాలి. అదేవిధంగా, మనం మరొక వ్యక్తిని విశ్వసించే ముందు లేదా స్నేహం చేసే ముందు అతన్ని సరిగ్గా పరిశీలించాలని చెప్పాడు. ఒక వ్యక్తిని పరీక్షించేటప్పుడు ఈ 4 అంశాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1. త్యాగ గుణం
ఆచార్య చాణక్యుడు మనం ఇతరులతో స్నేహం చేసినప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని గుడ్డిగా నమ్మవచ్చని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే అలాంటి వారు ఇతరుల గురించి ముందుగా ఆలోచిస్తారు. ఇతరుల సంతోషం కోసం త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం వల్ల మనం ఎప్పుడూ సమస్యల సుడిగుండంలో పడిపోయే ప్రమాదం ఉండదు.
2. చరిత్ర తెలుసుకోండి
చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, మంచి స్వభావం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు భావాలను కలిగి ఉండడు. అలాంటి వ్యక్తి నమ్మదగినవాడు. ఈ కారణంగా మనం మంచి స్వభావం గల వ్యక్తితో స్నేహం చేయడానికి ప్రయత్నించాలి. అలాంటి స్నేహం మనకు భద్రతా భావాన్ని ఇస్తుందని చాణక్య నీతిలో చెప్పాడు.
3. నమ్మకస్తుడా, కాదా
కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, అబద్ధం వంటి చెడు లక్షణాలు లేని వ్యక్తులను మీరు నమ్మవచ్చు. ఎందుకంటే ఈ లక్షణాలు లేనివారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. వారు మీ జీవితంలోని ఆనందకర సమయమైనా, బాధలో ఉన్నా మీతో పాలుపంచుకున్నారని గుర్తుంచుకోండి.
4. పనులపై నిఘా
ఒక వ్యక్తిని అంచనా వేయడానికి, ఆ వ్యక్తి చేసే పనులపై మీరు చాలా శ్రద్ధ వహించాలి. తప్పు చేసిన వారిని నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వారు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి వెనుకాడరు. కాబట్టి, సత్కార్యాలలో నిమగ్నమైన వ్యక్తితో స్నేహం చేయాలి.
Also Read : చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధమే
చాణక్యుడు తన చాణక్య నీతిలో, మనం ఒక వ్యక్తితో సంబంధాన్ని పెంచుకున్నప్పుడు లేదా ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు, పైన పేర్కొన్న 4 అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే స్నేహం లేదా సంబంధాన్ని ఏర్పరచుకోవాలని స్పష్టంచేశాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.