బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్... ఇలా చాలా రకాల నట్స్ ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు కూడా చెబుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో ఇవి ముందుంటాయని అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. వీటిలో ఉండే సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ కొవ్వులు వంటివన్నీ ఈ నట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సరైన పద్ధతిలో తింటే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక రక్తపోటును కూడా ఇవి సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అవిసె గింజలు, చియా సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాలను తగ్గిస్తాయి. అందుకే వీటిని రోజూ తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. అయితే వీటిలో అవిసె గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఇలాంటివి నేరుగా తినకూడదని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. 


పైన చెప్పిన చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు వంటివి వేయించుకుని తింటే ఆరోగ్యానికి అన్ని విధాల మంచి జరుగుతుంది. నానబెట్టకుండా లేదా వేయించకుండా తినడం వల్ల శారీరకంగా కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.


నానబెట్టడం లేదా వేయించడం చేయకుండా ఉండే నట్స్‌పై ఫైటేట్లు ఉండవచ్చు.  వీటివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అలా పేగు మార్గంలో అవి జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది.జీర్ణ ప్రక్రియను కూడా ఇవి కష్టతరం చేస్తాయి. కాబట్టి ముడి విత్తనాలు తినడం మానేయాలి. వేయించుకుని తినడం లేదా ముందు రోజు నానబెట్టుకుని మరుసటి రోజు తినడం వంటివి చేయాలి.


రోజూ వేయించుకొని తినడం కష్టం అనుకుంటే ఎక్కువ మొత్తంలో వేయించుకుని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. వాటిని రోజూ గుప్పెడు తీసుకుని తినవచ్చు. ఇంకా లేదనుకుంటే వేయించాక వాటిని పొడిలా మార్చుకుని నీళ్లలో కలుపుకొని తాగేయొచ్చు. అంతేకానీ ముడి విత్తనాలను అంటే వేయించకుండా, నానబెట్టకుండా ఉండే విత్తనాలను తినకపోవడం మంచిది. ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఆరోగ్యానికి మరిన్ని పోషకాలు అందుతాయి. 


కేవలం పెద్దలే కాదు పిల్లలకు కూడా నట్స్ తినడం అలవాటు చేయాలి. ఇవి వారి మెదడు మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో సహకరిస్తాయి.




Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ
















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.