Healthy Night Habits For Better Sleep : ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటికి కారణం కేవలం పగటి సమయంలో ఎదురయ్యే ఒత్తిడి మాత్రమే కాదని చెప్తున్నారు నిపుణులు. రాత్రుళ్లు ఫాలో అయ్యే కొన్ని అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు. మంచి నైట్ రొటీన్ అనేది ఎక్కువసేపు నిద్రపోవడానికే కాదని.. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు. 

Continues below advertisement

రోజంతా పనిచేసిన మెదడు, శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లేలా చేయడం మన బాధ్యత అని.. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. సరైన నిద్ర అలవాట్లు లేకపోతే ఒత్తిడి, చిరాకు, ఆందోళన పెరిగి.. ఏకాగ్రత లోపం, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రతిరోజూ ఒకే సమయం..

ప్రతిరోజూ నిద్ర వచ్చినా రాకున్నా.. ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో లేవడాన్ని శరీరానికి అలవాటు చేయాలని తెలిపారు. దీనివల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సమతుల్యంగా పనిచేస్తుంది. నిద్ర సమయాల్లో తరచూ మార్పులు చేస్తే.. మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్ నవీన్ కుమార్ హెచ్చరించారు.

Continues below advertisement

గంట ముందు నో స్క్రీన్

మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటి డిజిటల్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర పట్టడం ఆలస్యమవుతుంది. అందుకే నిద్రకు కనీసం గంట ముందు స్క్రీన్ల వినియోగాన్ని తగ్గించడం మంచిదని సూచించారు.

ప్రశాంతతనిచ్చే పనులు

పడుకునే ముందు పుస్తకం చదవడం, డైరీ రాయడం, మంచి సంగీతం వినడం, ధ్యానం లేదా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.

డైరీ లేదా జర్నల్

చాలామంది రాత్రుళ్లు రేపు చేయాల్సిన పనులు, సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో చేయాల్సిన పనుల జాబితాను ముందుగానే రాయడం లేదా థ్యాంక్స్ నోట్స్ రాసుకుంటే మనసు తేలికపడుతుందని చెప్తున్నారు.

నిద్రకు అనుకూలమైన రూమ్

మీరు పడుకోవాలి అనుకున్నప్పుడు గది చీకటిగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. సౌండ్స్, అధిక వెలుతురు, వేడి వాతావరణం నిద్ర నాణ్యతను తగ్గించవచ్చు. కాబట్టి గదిలో అవి లేకుండా చూసుకోవాలి. మంచి నిద్రలో గది కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు డాక్టర్ నవీన్ కుమార్. 

కెఫిన్ తగ్గించాలి

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ కలిగిన పానీయాలను సాయంత్రం తర్వాత తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అందుకే రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు నిపుణులు.

ఎక్కువగా తినకండి

నిద్రకు ముందు ఎక్కువ భోజనం చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీంతో అసౌకర్యం కలిగి నిద్రకు అంతరాయం కలగవచ్చు. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వ్యాయామాలు వద్దు

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. నిద్రకు ముందు అధిక శారీరక శ్రమ చేస్తే శరీరం మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇది నిద్రను ప్రభావితం చేయవచ్చు.

నిద్ర సమయంలో మెదడు మన ఎమోషన్స్, భావోద్వేగాలను ప్రాసెస్ చేస్తుంది. జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. మానసిక శక్తిని పునరుద్ధరిస్తుంది. కాబట్టి ప్రతి రాత్రి మంచి నైట్ రొటీన్‌ సెట్ చేసుకుని.. దానిని ఫాలో అవ్వడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం కూడా బెటర్ అవుతాయి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.