New Year Fitness Resolutions : నూతన సంవత్సరం 2025. పాత సంవత్సరం పోయి.. కొత్త సంవత్సరం వస్తే బరువు తగ్గాలనేది చాలామంది విష్​లిస్ట్​లో ఒకటిగా ఉంటుంది. దానిలో భాగంగానే జిమ్​కి జాయిన్ అవుతారు. గట్టిగా ఓ వారం లేదా నెల చేస్తారు. వెంటనే దానికి వివిధ కారణాలు చెప్పి బ్రేక్ ఇస్తారు. అయితే మీరు ఇలా జిమ్​ జాయిన్ అవ్వడం కాకుండా.. బరువు తగ్గేందుకు కొన్ని హెల్తీ టిప్స్​ని ఫాలో అవ్వొచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చేసేద్దాం. 


ఎన్ని పనులున్నా.. 


రోజుకు ఎన్ని పనులున్నా.. కనీసం పదివేల అడుగులు వేయాలనేది లక్ష్యంగా పెట్టుకోండి. అది రోజంతా కావొచ్చు. లేదా రాత్రి డిన్నర్ తర్వాత కావొచ్చు. ఏది చేసినా.. ఎండ్​ ఆఫ్​ ద డే మీరు పదివేల అడుగులు వేసేందుకు ప్రయత్నించండి. నడకను మీ డైలీ రోటీన్​లో భాగం చేస్తే.. బరువులోనే కాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో మార్పులు చూస్తారని చెప్తున్నారు నిపుణులు. ఇది బరువును తగ్గించడంలోనే కాకుండా బాడీని మంచి షేప్​కి తీసుకురావడంలో హెల్ప్ చేస్తుంది. 


నచ్చిన పని చేయండి.. 


బరువు తగ్గాలంటే మీరు జిమ్​కే వెళ్లాల్సిన పనిలేకుండా చేయగలిగే పనుల్లో స్పోర్ట్స్ ఒకటి. మీకు కుదిరే సమయాన్ని బట్టి.. వారంలో ఓ మూడు రోజులు దానికి కేటాయించండి. క్రికెట్, టెన్నిస్ వంటి గేమ్స్​ని మీ రోటీన్​లో భాగం చేయండి. దీనివల్ల మెటబాలీజం పెరుగుతుంది. బరువు తగ్గడంలో జీవక్రియ వండర్స్ చేస్తుంది. ఎంతగా అంటే మీ మెటబాలీజం పెరిగితే.. మీరు కూర్చొని ఉన్నా.. కేలరీలు వాటంతటా అవే కరిగి.. మీకు శక్తిని ఇస్తాయి. 


ఫుడ్​లో ఆ మార్పు చేయండి.. 


మీకు స్నాక్స్​ తినాలనుకున్నప్పుడు లేదా ఆకలి వేసినప్పుడు.. పండ్లు, కూరగాయలను మీ డైట్​లో చేర్చుకోండి. మేజర్​ పార్ట్​ ఇవి ఉండేలా చూసుకోండి. హెల్తీ ఫుడ్​ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గడంతో పాటు.. ఫిట్​నెస్​ గోల్స్​ని త్వరగా రీచ్ అవుతారు. భోజనం చేసే సమయంలో కూరగాయలను ఉడికించుకుని తినడం, డిన్నర్ సమయంలో లేదా బ్రేక్​ఫాస్ట్ సమయంలో, స్నాక్స్​గా ఫ్రూట్స్​ని తినవచ్చు. హెల్తీ ఫుడ్ చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. 


నిద్రకు టైమ్​ ఇవ్వండి.. 


మీరు ఎంత జిమ్ చేసినా.. ఎంత కష్టపడినా.. క్వాలిటీ స్లీప్ లేకపోతే మీ బరువులో ఎలాంటి మార్పులు ఉండవు. కాబట్టి రాత్రి నిద్రకు టైమ్ కేటాయించండి. రాత్రి నిద్ర కనీసం 8 నుంచి 9 గంటలు ఉండేలా చూసుకోండి. ఇది మీ నిద్ర సైకిల్​ని మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. పూర్తి ఆరోగ్యాన్ని మీకు అందిస్తుంది. అన్నిరోజుల నిద్రను సెలవు దినాల్లో కవర్ చేయడం కాకుండా.. రోజూ ఒకటే సమయానికి పడుకొని, ఒకే సమయానికి లేచే అలవాటు మంచి ఫలితాలు ఇస్తుంది. 


హైడ్రేషన్ 


నీరు ఎంత తాగి.. హైడ్రేటెడ్​గా ఉంటే.. మీరు శారీరకంగా, మానసికంగా, అందం పరంగా అంత హెల్తీగా ఉంటారు. కాబట్టి రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగేలా చూసుకోండి. లేదంటే రోజుకు 8 గ్లాసుల నీటిని తాగండి. 



ఈ సింపుల్​ రోటీన్​ మీరు బరువు తగ్గడంలో, ఫిట్​నెస్ గోల్స్​ని చేరడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. వీటితో పాటు మీరు జిమ్, ఇతర వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇవన్నీ మరిచిపోతామనుకునేవారు రిమైండర్స్ పెట్టుకున్నా.. మీ గోల్స్​ని సులువుగా రీచ్​ అయ్యే అవకాశముంది. 


Also Read : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు