Chief Minister Revanth Reddy met with Satya Nadella: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను కలిశారు. సత్య నాదెళ్ల వ్యక్తిగత పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. ఆయన స్వస్థలం హైదరాబాద్. బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉన్న సత్య నాదెళ్ల ఉన్నారు. ఆయనను అధికారికంగా కాకుండా కర్టెసీగా ప్రభుత్వ పెద్దలు కలిసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ రంగ అభివృద్ధి కోసం సత్యనాదెళ్ల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినట్లుగా తెలుస్తోంది.
సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో చదువుకుని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆయన తండ్రి యుగంధర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన కొంత కాలం క్రితం చనిపోయారు. లో ప్రోఫైల్ ఇష్టపడే సత్య నాదెళ్ల ఎక్కువ హంగామా చేయరు. హైదరాబాద్ వచ్చిన విషయం తెలియడంతో ప్రభుత్వ పెద్దలు ఆయనను కలవాలని ఆసక్తి చూపించడంతో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా అధికారికంగా పర్యటనలకు గతంలో వచ్చారు. అప్పుడు నేరుగా మైక్రోసాఫ్ట్ ఆర్ అండ్ డీకి వెళ్లి ఉద్యోగులతో సమావావేశాలు నిర్వహించేవారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ .. అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్‌ను నిర్మిస్తోంది, డేటా, క్లౌడ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది.
సత్య నాదెళ్లతో జరిగి సమావేశానికి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. అలాగే బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో పెట్టుబడులు, ఇతర అంశాల్లో కీలకంగా వ్యవహరించి సీనియర్ అధికారి జయేష్ రంజన్ కూడా వెళ్లారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వెళ్లారు. సాఫ్ట్ వేర్ రంగంలో తెలంగాణలో తాము చేపట్టబోయే ప్రాజెక్టులు, ఏఐ సిటీ నిర్మాణం, ఫోర్త్ సిటీ వంటి వాటిపై ముఖ్యమంత్రి సత్యనాదెళ్లకు వివరించినట్లుగా తెలుస్తోంది. వాటిని సక్సెస్ ఫుల్ చేయడంలో నాదెళ్ల సలహాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.