PPF Interest Rate Hike Expected In 2025: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ (Public Provident Fund)లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు 31 డిసెంబర్ 2024న ప్రభుత్వం ఊరట కల్పిస్తుందా?, గత ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయానికి ఫుల్‌స్టాప్‌ పెడుతుందా?. చిన్న మొత్తాల పొదుపు పథకాల మార్కెట్‌లో ఇప్పుడు ఇదే చర్చ. 


వాస్తవానికి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్‌ను (PPF Interest Rate) కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2018 అక్టోబర్‌లో పెంచింది. అప్పుడు, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పీపీఎఫ్‌ వడ్డీ రేటును 8 శాతానికి పెంచింది. PPF వడ్డీ రేట్లు 6 సంవత్సరాలకు పైగా పెంచలేదు. స్టోరీ ఇక్కడితో ఐపోలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత, పీపీఎఫ్‌ వడ్డీ రేటును విడతల వారీగా తగ్గిస్తూ వచ్చింది. చివరిసాగి, 2020 ఏప్రిల్‌లో, 7.9 శాతం నుంచి 7.1 శాతానికి కోత పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే వడ్డీ రేటు కొనసాగిస్తోంది, కనీసం 10 బేసిస్‌ పాయింట్లు కూడా పెంచలేదు.


సుకన్య సమృద్ధి యోజనపై ఎక్కువ వడ్డీ, PPFపై తక్కువ వడ్డీ!  
2022 మే నుంచి ఇప్పటి వరకు, RBI రెపో రేటును 2.5 శాతం పెంచిన ఈ కాలంలో, బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకం, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఇతర పోస్టాఫీసు పొదుపు పథకాలు (Interest Rates Of Post Office Saving Schemes), చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను (Interest Rates Of Small Saving Schemes) కూడా పెంచింది. కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును మాత్రం మార్చలేదు, అదే 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదార్లకు 8.2 శాతం వడ్డీ చెల్లిస్తోంది.


2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 50 నుంచి 140 బేసిస్ పాయింట్లు తగ్గించారు. గత రెండేళ్ళలో వడ్డీ రేట్లను మళ్లీ పెంచారు. కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను ఈ పెంపు నుంచి దూరంగా ఉంచారు.


ఫార్ములా రేట్ల కంటే పీపీఎఫ్‌పై తక్కువ వడ్డీ
ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ నేతృత్వంలోని ప్యానెల్, సెక్యూరిటీలపై వచ్చే రాబడి ఆధారంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని కోసం ఒక ఫార్ములాను ప్రతిపాదించింది. ఆ ఫార్ములా ఆధారంగా, అన్ని స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కానీ, ఫార్ములా రేట్‌ కంటే పీపీఎఫ్‌పై 41 బేసిస్ పాయింట్లు (0.41 శాతం) తక్కువ వడ్డీని ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ కూడా అంగీకరించింది. 


కొత్త సంవత్సరంలో న్యాయం జరుగుతుందా?
PPF పెట్టుబడిదారులు - సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదారుల మధ్య కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న అభిప్రాయాలు మార్కెట్‌ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను 31 డిసెంబర్ 2024న కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. అప్పుడైనా PPF పెట్టుబడిదారులకు న్యాయం జరుగుతుందేమో చూడాలి.


మరో ఆసక్తికర కథనం: సీటీసీకి, చేతికొచ్చే జీతానికి మధ్య ఇంత తేడా ఎందుకు, పే స్లిప్‌లో ఎలాంటి కటింగ్స్‌ ఉంటాయ్‌?