CTC Vs In-Hand Salary: పే స్కేల్‌ను శాలరీ స్ట్రక్చర్‌ అంటారు. ఒక ఉద్యోగి, తన పనికి ప్రతిఫలంగా కంపెనీ నుంచి ఎంత డబ్బు పొందగలడో ఇది చూపిస్తుంది. ఉద్యోగంలో చేరే ముందు, జీతం కోసం కంపెనీ ఒక అమౌంట్‌ను ఆఫర్‌ చేస్తుంది, దానిని CTC (Cost to Company) అని చెబుతుంది. అయితే, నెల తర్వాత మీ చేతికి వచ్చే జీతం CTC కంటే తక్కువగా ఉంటుంది. మీ శాలరీ స్లిప్‌ను ఒకసారి తనిఖీ చేస్తే, CTC కంటే మీ జీతం ఎందుకు తగ్గిందో సులంభంగా అర్థం చేసుకోవచ్చు.


కంపెనీ మీకు ఆఫర్‌ చేసే సీటీసీలో ఎలాంటి కటింగ్స్‌ ఉండవు. పైగా, ఉద్యోగి కోసం కంపెనీ వెచ్చించే క్యాబ్‌, క్యాంటీన్‌ వంటి ఖర్చులను (ఇవి ఉద్యోగికి బెనిఫిట్స్‌ లాంటివి) కూడా CTCలో కలుపుతుంది. కాబట్టి సీటీసీ అమౌంట్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బెనిఫిట్స్‌ తాలూకు ఖర్చులు, ఇతర డిడక్షన్స్‌ తీసేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని జీతం రూపంలో మీ అకౌంట్‌లో క్రెడిట్‌ చేస్తుంది. కాబట్టి, CTC కంటే జీతం చాలా తక్కువగా ఉంటుంది.


శాలరీ స్లిప్‌లో కనిపించే డిడక్షన్స్‌ & అలవెన్స్‌లు:


ప్రాథమిక జీతం
ప్రాథమిక జీతం (Basic Pay) అనేది మీ పనికి బదులుగా కంపెనీ ఇచ్చే కనీస మొత్తం. ఇందులో హెచ్‌ఆర్‌ఏ, బోనస్, ఓవర్‌టైమ్, పన్ను మినహాయింపులు ఏవీ ఉండవు. 


ఇంటి అద్దె భత్యం (HRA)
శాలరీ స్ట్రక్చర్‌లో ఇంటి అద్దె భత్యం కూడా ముఖ్యమైన భాగం. ఇది, ఇంటి అద్దె చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం తన ఉద్యోగులకు ఇచ్చే భత్యం. సాధారణంగా, HRA ప్రాథమిక వేతనంలో 50 శాతం వరకు ఉంటుంది. ఈ మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు అద్దె రసీదులు సమర్పించి, దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. HRA పొందుతున్న వ్యక్తి తన సొంత ఇంట్లో నివసిస్తుంటే, అతను పన్ను ప్రయోజనాన్ని పొందలేడు.


సెలవు ప్రయాణ భత్యం (LTA)
కంపెనీ తన ఉద్యోగులకు దేశీయ ప్రయాణాల కోసం ఈ సౌకర్యాన్ని అందిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(5) ప్రకారం, ఉద్యోగులు ప్రయాణ సమయంలో చేసే ఖర్చులపై విధించే పన్నుపై మినహాయింపు పొందవచ్చు. అయితే, నాలుగు సంవత్సరాల బ్లాక్‌లో చేసిన రెండు ప్రయాణాలపై మాత్రమే మినహాయింపును క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. LTAపై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి.. హోటల్ బిల్లు, బోర్డింగ్ పాస్, రైలు టిక్కెట్ వంటి వాటిని యాజమాన్యానికి సమర్పించాలి & ఫామ్ 12BBని కూడా పూరించాలి. 


ప్రత్యేక భత్యం (Special Allowance)
ఇది ఒక రకమైన రివార్డ్, ఉద్యోగులను ప్రోత్సహించడానికి కంపెనీ ఇస్తుంది.


మొబైల్ & ఇంటర్నెట్ అలవెన్స్‌
ఉద్యోగానికి సంబంధించి ఇంటర్నెట్, మొబైల్‌ ఫోన్‌ కోసం అయ్యే ఖర్చులు దీనిలో ఉంటాయి. కంపెనీ ఈ బిల్లులను రీయింబర్స్ చేస్తుంది. ఒక పరిమితి వరకు, ఎలాంటి పన్ను మినహాయించకుండా బిల్లుపై అయ్యే ఖర్చులు చెల్లిస్తుంది.


ఆహార భత్యం
విధులు నిర్వహించేటప్పుడు ఆహారం కోసం చేసే ఖర్చు భారం ఉద్యోగిపై పడకుండా, కంపెనీ ఇలాంటి భత్యం ఇస్తుంది.


రవాణా భత్యం
ఇల్లు - ఆఫీసు మధ్య ప్రయాణానికి ఉద్యోగికి అయ్యే ఖర్చును భర్తీ చేయడానికి రవాణా భత్యం రూపంలో తిరిగి చెల్లిస్తుంది.


వృత్తి పన్ను
నిర్దిష్ట పరిమితికి మించి సంపాదించే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని విధిస్తాయి.


ఉద్యోగుల భవిష్య నిధి (EPF)
ఇది పదవీ విరమణ పొదుపు పథకం. ఇందులో, ఉద్యోగి & యజమాని ఇద్దరూ 12 శాతం చొప్పున సహకరిస్తారు.


TDS (Tax Deducted at Source)
ఉద్యోగులు లేదా ప్రజల నుంచి ముందుస్తుగానే పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం ఉపయోగించే ఆయుధం ఇది. జీతం నుంచి దీనిని కట్‌ చేస్తారు.


మరో ఆసక్తికర కథనం: ఆధార్ కార్డ్‌పై కనిపించే VID నంబర్ అర్థం ఇదా!, మీ వివరాలన్నీ ఫుల్‌ సేఫ్‌!