80 Million Bacteria Swapped in a Single Kiss : ముద్దు లేని ప్రేమ.. ప్రేమ కాదని.. ప్రేమలేని ముద్దు.. ముద్దు కాదని.. ఓ లిరిక్ రైటర్ రాశారు. అందుకేనేమో ముద్దును ప్రేమకు ప్రతిరూపంగా చెప్తారు. ఓ వ్యక్తిపై తమకున్న ప్రేమను వ్యక్తం చేయడంలో ముద్దు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్​ను లవ్ హార్మోన్​గా చెప్తారు. అందుకే ముద్దు అనేది ప్రేమను ట్రాన్స్​ఫర్ చేస్తుందని చెప్తారు. కానీ తాజా అధ్యయనం ముద్దు ప్రేమనే కాదు.. బ్యాక్టీరియాను ట్రాన్స్​ఫర్ చేస్తుందంటూ నిరూపించింది. 


ఓపెన్ యాక్సెస్ జర్నల్ మైక్రోబయోమ్​లో ఈ పరిశోధన గురించి ప్రచురించారు. 10 సెకన్లు ముద్దు పెట్టుకుంటే.. 80 మిలియన్ల బ్యాక్టీరియా బదిలీ అవుతుందని దీనిలో రాసుకొచ్చారు. అలాగే రోజుకు తొమ్మిదిసార్లు ఒకరినొకరు ముద్దుపెట్టుకునేవారు ఒకే రకమైన నోటి బ్యాక్టీరియాను పంచుకుంటున్నట్లు గుర్తించారు. 


ముద్దుకు ముందు.. ముద్దు తర్వాత


నెదర్లాండ్స్​లో మైక్రోపియా, TNO పరిశోధకులు 21 జంటలపై ఈ అధ్యయనం చేశారు. వారు లిప్​ కిస్​ ఫ్రీక్వెన్సీ నుంచి.. ముద్దు పెట్టుకున్నప్పుడు వారు ప్రవర్తించే అంశాలపై డేటా సేకరించారు. అలాగే ముద్దు తర్వాత పరిశోధన కోసం ముద్దుకు ముందు.. ముద్దు తర్వాత వారి లాలాజలం సేకరించి.. నోటి మైక్రోబయోటాను తీసుకున్నారు. ఎక్కువసార్లు లిప్​ కిస్ పెట్టుకున్నప్పుడు వారి లాలాజల మైక్రోబయోటా ఒకేలా మారుతుందని ఫలితాలు నిరూపించాయి. అలాగే రోజుకు తొమ్మిదిసార్లు ముద్దు పెట్టుకునేవారిలో ఈ పరిస్థితి గణనీయంగా ఉంటుందని తేల్చారు. 


పరిశోధన దానిపై మాత్రమే.. 


ఈ అధ్యయనంలో కేవలం బ్యాక్టీరియా బదిలీపై మాత్రమే దృష్టి పెట్టింది. కానీ వైరస్​లు, ఇతర వ్యాధికారక కారకాలపై కాదు. అంటే ముద్దు పెట్టుకునే సమయంలో బ్యాక్టీరియా బదిలీ వల్ల కలిగే బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్​పై ఫోకస్ చేయలేదు. ముద్దుకు ముందు ఉన్న బ్యాక్టీరియా, ముద్దు తర్వాత ఉన్న బ్యాక్టీరియా పరిమాణాలను మాత్రమే విశ్లేషించారు. దీనిలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన బ్యాక్టీరియా ప్రొఫైల్ కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. అవి వారి ఆరోగ్యం, ఆహారం, లైఫ్​స్టైల్​ వల్ల ప్రభావితమవుతుందని తేల్చారు. అయితే భాగస్వాముల మధ్య జన్యు పదార్ధాల మార్పిడిలో ముద్దు ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.


బ్యాక్టీరియా అవసరమే.. 


మానవ శరీరంలో 100 ట్రిలియన్ల కంటే ఎక్కువ సూక్షజీవులు ఉంటాయి. సూక్ష్మ జీవుల పర్యావరణ వ్యవస్థ, మైక్రోబయోమ్స్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను శరీరానికి అందించడానికి.. వ్యాధులను నివారించడానికి అవసరం అవుతాయి. ఇవి తీసుకునే ఆరహారం, వయసు ద్వారా ప్రభావితమవుతాయి. అయితే వీటితో పాటు ముద్దు కూడా బాక్టీరియాపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుందట. ఎందుకంటే నోరు 700 కంటే ఎక్కువైన బాక్టీరియాలకు హోస్ట్​గా ఉంటుంది. కాబట్టి నోటి మైక్రోబయోటా కూడా ఇతరులను ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. 



Also Read : ఎంగిలి మూతితో ముద్దు పెట్టుకుంటే Peelings-U కాదు.. రోగాలు వస్తాయట జాగ్రత్త





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.