RTC Buses Collided In Bhakarapeta In Tirupati: తిరుపతి జిల్లాలో (Tirupati District) ఒకే రోజు వరుస ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొని ప్రమాదం జరగ్గా.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట (Bhakarapeta) కనుమదారి మొదటి మలుపులో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 బస్సుల్లోని దాదాపు 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న మదనపల్లి ఎక్స్ ప్రెస్.. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తోన్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కోగా.. స్థానికులు అతికష్టం మీద అతన్ని బయటకు తీశారు. క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రహదారిపై రాకపోకలు స్తంభించగా.. పోలీసులు రోడ్డుగా అడ్డంగా ఉన్న బస్సులను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
మరోవైపు, తిరుమల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్డులో డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండడంతో రోడ్డుపైనే బస్సు నిలిచిపోయింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో అలిపిరి వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకుని బస్సును క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Also Read: Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?