Humans Spreads More Viruses : కొన్నిరకాల వైరస్​లు జంతువుల నుంచి మనకి వ్యాప్తి చెందుతాయి. దానివల్ల ఏమనుకుంటామంటే.. అమ్మో ఈ జంతువులకు దూరంగా ఉండాలి అనుకుంటాము. ఇది కొన్ని సందర్భాల్లో నిజం కూడా అవుతుంది. కానీ నిజం చెప్పాలంటే జంతువుల వల్ల మనకి కాదు.. మనవల్లనే జంతువులకు ఎక్కువ వైరస్​లు వ్యాప్తి చెందుతాయని తాజాగా అధ్యయనం తెలిపింది. పాపం వాటికి నోరు, సోషల్ మీడియా లేదు కాబట్టి.. మనం చాలా సింపుల్​గా వాటివల్లే ఇలాంటి వైరస్​లు వ్యాప్తి చెందుతున్నాయని అంటూ ఉంటాము. 


గ్లోబల్ డేటాబేస్ ప్రకారం..


వైరస్​ జన్యువలు విశ్లేషణలో మానవులు, ఇతర జంతువుల మధ్య ఉన్న వైరస్​లపై రీసెర్చ్ చేసినప్పుడు.. 64 శాతం కేసులలో మానవుల నుంచే ఇతర జంతువులకు వైరస్​ సోకినట్లు గుర్తించారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్​లో ఈ పరిశోధన చేశారు. జంతువులకు ఇచ్చే వైరస్​ల కంటే.. మనం వాటికి ఎక్కువ వైరస్​లు ఇస్తామని కాలేజ్ ప్రొఫెసర్ సెడ్రిక్ టాన్ తెలిపారు. ఈ అధ్యయనంలో గ్లోబల్ డేటాబేస్​ను ఉపయోగించారు. వైరస్​లు ఎలా స్ప్రెడ్​ అవుతున్నాయనే దానిపై అధ్యయనం చేసి కీలక విషయాలు వెల్లడించారు. 


పూర్తి ఫ్యామిలీ ట్రీని తయారు చేసి..


ఈ డేటా బేస్​లో 12 మిలియన్ స్వీక్వెన్సులు గుర్తించారు. అయితే అవి చాలా వరకు అసంపూర్ణగా ఉన్నాయని.. వాటిలో దేని నుంచి వైరస్ స్ప్రెడ్ అయిందనే దానిపై డేటా లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పరిశోధకులు పూర్తి డేటాతో 12 మిలియన్లు దాదాపు 60000లకు తగ్గించారు. ఇప్పుడు ఈ వైరస్​ల గురించి ఆరా తీస్తూ.. ఫ్యామిలీ ట్రీ చేశారు. దాదాపు 13000 వైరస్​లను గుర్తించారు. ఇలా తయారు చేసిన ట్రీ ప్రకారం మనుషులనుంచే జంతువులకు వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించారు. అయితే మానవుల నుంచి ఇతర జంతువులకు వైరస్​లు వ్యాపించడం వల్ల చాలా జీవులు అంతరించిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. హ్యూమన్ రెస్పిరోవైరస్ వ్యాప్తి కారణంగా ఉగాండలోని అనేక అడవి చింపాంజీలు చనిపోయాయని తెలిపారు. 


వైరస్ విస్తరించడానికి కారణం అదే..


ఇదే కాకుండా మానవుల ద్వారా వ్యాప్తి చెందుతున్న వైరస్.. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర జాతులకు చేరే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఒక ప్రాంతానికే పరిమితమైన జంతువులలో వ్యాపించే వైరస్ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. కానీ మనుషుల వల్ల ఇతర దేశాలకు, ప్రాంతాలకు చాలా సులువుగా వైరస్​లు విస్తరిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. SARS-CoV-2, MERS-CoV, ఫ్లూ వైరస్​లు సాధారణంగా మనుషుల ద్వారా జంతువులకు సంక్రమించేవని అధ్యయనం కనుగొంది. వ్యక్తుల నుంచి పెంపుడు జంతువులు, జూ జంతువులు.. అలా అడవి జంతువులకు వ్యాపించిందని అధ్యయనం తెలిపింది. వీటిని మినహాయించినప్పటికీ.. మిగిలిన వైరస్ వ్యాప్తి మానవుల నుంచి ఇతర జంతువులకు ఎక్కువగా వెళ్తున్నాయని పరిశోధన బృందం తెలిపింది. 


Also Read : మామిడి పండ్లు నీటిలో నానబెట్టాకే తినాలట.. లేదంటే ఆ సమస్యలు తప్పవంటున్న నిపుణులు




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.