Old Tradition of Soaking Mangoes : పిల్లల నుంచి పెద్దలవరకు మామిడి పండ్లను చాలా ఇష్టంగా తింటారు. వీటి అద్భుతమైన రుచి.. మామిడి ప్రియులను ఎంతగానో ఎదురు చూసేలా చేస్తుంది. వేసవిలో మాత్రమే దొరికే ఈ ఫ్రూట్​ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి ఎండలతో పాటు మామిడి పండ్లు కూడా కాస్త వేగంగానే వచ్చాయి. మార్చినెల ముగియక ముందే మార్కెట్లలో మామిడి పండ్లు వచ్చేశాయి. గతంలో ఉగాది తర్వాత నుంచి మామిడి కాయలు, పండ్లను వినియోగించుకునేవారు. కానీ ఇప్పటికే కొన్ని మార్కెట్లలోకి వచ్చేస్తున్నాయి. 


రుచే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..


మామిడికాయల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచుతాయి. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు, చర్మంకి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఈ సమయంలో మామిడిపండు తినాలకుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. మార్కెట్లలో కొన్న మామిడి పండ్లను తినడానికి ముందు వాటిని నానబెట్టాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ తినే ముందు మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి? ఎంతసేపు నానబెట్టాలి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? నానబెట్టకుండా కలిగే నష్టాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


నీటిలో నానబెట్టాలట.. 


మార్కెట్లో మామిడిపండ్లు కొని.. వాటిని ఫ్రిజ్​లో పెట్టి.. చల్లగా తినేందుకు చూసేవారు చాలామందే ఉన్నారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే మామిడిపండ్లను తెచ్చిన వెంటనే ఫ్రిజ్​లో కాకుండా.. నీటిలో నానబెట్టాలి అంటున్నారు నిపుణులు. మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాకుండా.. పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శఖ్తిని పెంచుతాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో ఉంటాయి. అందుకే వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. 


ఫైటిక్ యాసిడ్ తగ్గుతుందట.. 


మామిడి పండ్లను నానబెట్టి తీసుకోవడం వల్ల దానిలో పోషకాలు శరీరం పొందడానికి సహాయం చేస్తుంది. మామిడిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్​గా పనిచేస్తుంది. దానివల్ల శరీరంలోని పోషకాల శోషణ తగ్గుతుంది. మామిడి పండ్లను నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఈ యాసిడ్​ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్​లు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మామిడి పండ్లను నానబెట్టే పద్ధతి ముందునుంచి ఉన్నదే. కానీ ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల పండ్ల మీద ఉండే.. పురుగుమందులు కూడా తొలగిపోతాయి. 


వ్యాధులను దూరం చేస్తుంది..


మామిడి పండ్లలో ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ కెమికల్స్ సహజమైన ఫ్యాట్ బస్టర్స్​గా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. పండ్లను నానబెట్టడం వల్ల క్రిమిసంహారకాలు, రసాయనాలు తొలగిపోతాయి. మురికి, దుమ్ము, మట్టి పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల మీకు అనేక వ్యాధులు దూరమవుతుంది. అపానవాయువును నివారిస్తుంది. మామిడి వల్ల కలిగే థర్మోజెనిక్ ప్రభావం తగ్గుతుంది. దానివల్ల వేడి చేయదు. అందుకే మామిడి పండ్లను నానబెట్టాలి అంటున్నారు. ఇలా చేయడం వల్ల జరిగే నష్టం ఏమి లేదు కానీ.. ఆరోగ్యానికి మంచి చేస్తుంది కాబట్టి ఫాలో అయితే మంచిది అంటున్నారు నిపుణులు. 


Also Read : ఈ ఇంటి చిట్కాలు మీకు తెలుసా? పాతవే అయినా ఇప్పటికీ ఎఫెక్టివ్​గా పనిచేసే టిప్స్ ఇవే



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.