Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సలైట్‌లు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. CRPF జవాన్లు, మావోలకు మధ్య ఉదయం నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరుగురి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సలైట్‌ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తల్పెరు నదీ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా CRPF జవాన్లతో పాటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా (CoBRA) సిబ్బంది నక్సల్స్‌పై కాల్పులు జరిపారు.


 






People's Liberation Guerrilla Armyకి చెందిన నక్సలైట్‌లు అక్కడే ఉన్నారన్న సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడ నిఘా పెట్టారు. దాదాపు 10 మంది మావోయిస్ట్‌లు అక్కడే ఉన్నారు. వాళ్లపై కాల్పులు జరిపారు. అటు నక్సల్స్ కూడ ఎదురు కాల్పులకు దిగారు. ఉదయం నుంచి ఈ కాల్పులు కొనసాగాయి. కాసేపటికి రెండు వైపులా కాల్పులు ఆగిపోయాయి. ఆ తరవాత ఆరుగురు నక్సల్స్‌ మృతదేహాల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరి కొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని వెల్లడించారు.