Nurses Week 2024 : సమాజంలో నర్సుల పాత్రను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం మే 6వ తేదీన జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు అందిస్తున్న సహకారం, ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కలిపిస్తారు. కొవిడ్ సమయంలో ఇతర ఆపత్కాల సమయంలో నర్సులు అందించిన సేవలు అన్ని ఇన్ని కాదు. ఈ తరహా నేపథ్యంలోనే నర్సుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. మే 6వ తేదీ నుంచి నర్సుల వారోత్సవాలు చేస్తారు. ప్రజాసేవలో నర్సులు పోషించే కీలక పాత్రను ప్రజలందరూ గుర్తించాలనే లక్ష్యంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు మే 6న ప్రారంభమై.. మే 12వ తేదీన ముగుస్తాయి.
నర్సింగ్‌లో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలను గుర్తిస్తూ.. ఈ నర్సుల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఆమె బర్త్‌డే రోజున అంటే మే 12వ తేదీన నర్సుల వారోత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ ఆంగ్లేయురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ కేవలం సంఘసంస్కర్త మాత్రమే కాదు.. ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు కూడా. క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికుల సంరక్షణలో ఆమె అందించిన సేవలకు గుర్తుగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే ఆమెకు ది లేడి విత్ ది ల్యాంప్ అనే పేరు కూడా పెట్టారు. ఎందుకంటే ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులను రాత్రుళ్లు సేవలు చేసేదని చెప్తారు.
నర్సుల దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారంటే..
నర్సుల వారోత్సవాల్లో భాగంగా.. ప్రతిచోటా నర్సుల బాధ్యతలను గుర్తించేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. వైద్యుడి దగ్గరికి చికిత్సకు వెళ్లినప్పుడు, శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో నర్సులే పేషెంట్లకు, డాక్టర్లకు మధ్య వారధులు అవుతారు. కానీ డాక్టర్లకు వచ్చినంత పేరు.. నర్సులకు ఇవ్వలేరు. ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరికొందరు సోషల్ మీడియాలో నర్సుల గురించి పోస్టులు వేస్తూ అవగాహన కల్పిస్తారు.
నర్సుల దినోత్సవం చరిత్ర
1953లో నర్సుల దినోత్సవాన్ని తెరపైకి తీసుకువచ్చారు. యూఎస్‌లో దానికి ఆమోదం లభించకపోవడంతో తర్వాత సంవత్సరంలో మొదటిసారిగా నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. 1974వరకు ఇదే కొనసాగగా.. అదే సంవత్సరంలో జాతీయ నర్సుల వారోత్సవాలను ప్రకటించారు. 1981లో మే 6వ తేదీని జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలను ఓ కొత్త థీమ్‌తో ప్రజల ముందుకి తీసుకువెళ్తారు. అయితే ఈ నర్సింగ్ వృత్తికి 1896 నుంచి కూడా అమెరికన్ నర్సుల సంఘం మద్ధతునందించింది. అనంతరం అది రాష్ట్ర స్థాయిలో.. వివిధ దేశాలలో గుర్తింపును సంతరించుకుంది. అప్పటి నుంచి నర్సులు చేసే సేవలను గుర్తిస్తూ.. నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఈ జాతీయ నర్సుల దినోత్సవాన్ని.. 1974వ సంవత్సరం జనవరిలో.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు మే 12వ తేదీని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. 1965 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు అంతర్జాతీయ నర్స్ డేని నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీతో మొదలయ్యే జాతీయ నర్సుల వారోత్సవాలు కాస్త.. మే 12వ తేదీతో అంతర్జాతీయ నర్స్ డేగా ముగుస్తాయి.
Also Read : రక్తపోటు కారణంగా పిల్లల్లో పెరుగుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్.. అధ్యయనంలో వెలుగు చూసిన షాకింగ్ విషయాలు ఇవే