Health Tips: ఈ మధ్యకాలంలో రక్తపోటు అనేది పిల్లల్లో ఎక్కువ కనిపిస్తోంది. అయితే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లో గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు బీపీ ఒక ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న వయసులో ఉన్న వారిలో కూడా గుండెపోటు వస్తున్న వార్తలు వింటూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణం చిన్నతనం నుంచే వారిలో బీపీ ఉండటం కూడా కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ ఉన్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వీరికి ఇతర స్ట్రోక్ లు వచ్చే రిస్క్ ఉందని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. కెనడాకు చెందిన మెక్ మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పిల్లల్లో కూడా హై బీపీ ఉండటం కారణంగానే గుండెకు సంబంధించిన వ్యాధులు వారిలో తలెత్తుతున్నాయని నిపుణులు గుర్తించారు.
పిల్లల్లో హైబీపీకి కారణాలు ఏంటి.?
సాధారణంగా రక్తపోటు అంటే.. రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగాన్ని బీపీలో కొలుస్తారు. గుండె నుంచి ఇతర భాగాలకు రక్తం సరఫరా అవుతుంది ఈ సరఫరా అయినప్పుడు రక్త ప్రవాహం అసాధారణంగా ఎక్కువగా ఉన్నప్పుడు హై బీపీకి దారి తీస్తుంది. సాధారణంగా బీపీ కొలిచే మిషన్ ఆధారంగా చూసినట్లయితే 120/80 నార్మల్ బీపీగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. అదే సమయంలో 140/90 ఉన్నట్లయితే ఈ పరిస్థితిని హైబీపీగా పరిగణిస్తుంటారు. అయితే ఈ హైబీపీ అనేది సాధారణంగా వయసు మీద పడ్డ వారికి ముఖ్యంగా ముసలి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ.. మారుతున్న జీవన శైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 15 మంది పిల్లల్లో ఒకరికి ఈ హైబీపీ అనేది నమోదు అవుతోంది. దీంతో పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. మన దేశంలో హై బీపీ కారణంగా ఏటా 10.8% మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ మరణాల్లో చిన్న వయసులో వారు ఉండటం కూడా గమనార్హం.
అధ్యయనంలో ఏమి తేలిందంటే..
కెనడాలోని ఒంటరియోలో 1996 నుంచి 2021 వరకు దాదాపు 25 వేల మంది బాలబాలికల్లో హైబీపీ ఉన్నట్లు గుర్తించారు వీరి సగటు వయస్సు 13 సంవత్సరాలుగా నిర్ధారించారు. వీరిలో పలువురికి గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, అదే విధంగా గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన వారు ఉన్నారు. అయితే చిన్న వయసులోనే వీరిలో బీపీ ఉన్న లక్షణాలను ముందుగానే గుర్తించినట్లయితే గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యం తలెత్తకుండా ముందు జాగ్రత్త పడవచ్చని పరిశోధనలో తేలింది. అయితే ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. పిల్లలకు కూడా తరచూ వైద్య పరీక్షల్లో భాగంగా రక్తపోటును చెక్ చేయడం కూడా అవసరమని ఈ అధ్యయనం ద్వారా వెళ్లడైంది. అయితే మారుతున్న జీవనశైలి కూడా పిల్లల్లో రక్తపోటుకు కారణం అవుతోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం వల్ల ఇటువంటి జబ్బుల నుంచి బయట పడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read : Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు