ప్రశ్న: మా పెళ్లయి ఐదేళ్లు గడుస్తోంది. నా భార్య ఉద్యోగం చేయదు. ఇంట్లోనే ఉంటుంది. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉండి వస్తాను. ఆమె రోజంతా టీవీ చూస్తూ గడపడానికి ఇష్టపడుతుంది. ఇంట్లోని పనులను కూడా నన్నే చేయమని బలవంతం చేస్తుంది. నేను రోజంతా బయట కష్టపడి వచ్చి ఇంట్లో పనులు చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఆమె సోమరితనాన్ని చూస్తే చాలా కోపం వస్తుంది. కానీ నేను గట్టిగా మాట్లాడలేను. చాలా సౌమ్యుడిని. నా అభిప్రాయాలు చెప్పడానికి నాకు ధైర్యం ఉండదు. ఇంట్లో టీ, కాఫీలు నేనే చేయాల్సి వస్తోంది. ఆమె మాత్రం ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తూ గడుపుతోంది. కష్టపడి వచ్చిన భర్తను ఎలా చూసుకోవాలో ఆమెకి ఎవరూ చెప్పడం లేదు. ఇలాంటి గొడవలు పడకుండా నా భార్యను దారిలో పెట్టుకోవడం ఎలా?
జవాబు: మీరు రాసిన లేఖను బట్టి చూస్తుంటే మీరు ఎంతో సౌమ్యంగా ఉండే వ్యక్తులని అర్థం అవుతోంది. మీకు కోపం చూపించడం, అరవడం, తిట్టడం లాంటివి ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే మీ భార్య సోమరితనం మాత్రం మిమ్మల్ని చాలా ఆందోళనకు గురిచేస్తుంది. చిన్నచిన్న చిట్కాలు ద్వారా మీరు ఆమెను పనిచేసేలా చేయొచ్చు. కాకపోతే దానికి చాలా ఓపిక అవసరం. మీరు ఆమెతో నేరుగా నోటితో ఏమీ చెప్పలేనని, అరవలేనని, కోపం చూపించలేనని చెప్పారు. కాబట్టి ఒక నోట్ బుక్ తీసుకోండి. అందులోంచి ఒక పేజీని చించండి. మీరు ఆమెతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా రాయండి. మీకు ఏది ఇష్టం లేదో అది కూడా స్పష్టంగా రాయండి. మీకు ఏం కావాలో, ఆమె ప్రవర్తన వల్ల మీరు ఎంతగా మానసికంగా కుంగిపోతున్నారో వివరించండి. అలాగే మీ జీవితంలో ఆమె ఎంత ముఖ్యమో చెబుతూ పెద్ద లేఖను రాయండి. ఆ లేఖను ఆఫీస్ కి వెళ్లడానికి ముందు ఆమెకు ఇచ్చి వెళ్లండి. సాయంత్రం వచ్చాక ఆమెలోని మార్పు ఏమైనా కనిపిస్తుందేమో గమనించండి. మార్పు కనిపిస్తే మీరు అదృష్టవంతులే.
ఆమె మీ లేఖను చూసి కాస్త కలత చెందే అవకాశం ఉంది. ఆమె తీరును మళ్లీ మార్చడానికి కాగితాలనే ఆశ్రయించండి. ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లే ముందు ఆమెలో మీకు నచ్చిన లక్షణాన్ని కాగితంపై రాసి, ఆమెకు ఇచ్చి వెళ్లండి. ‘ నా భార్య ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నేను కృతజ్ఞుడిని’ అని రాయడం, ఆమె వండిన వంట బాగుంటే ‘ఈరోజు నా భార్య చేసిన నువ్వు చేసిన వంటకం నాకు ఎంతో నచ్చింది’ అని మెచ్చుకోవడం వంటివి పేపర్ పై రాసి ఇచ్చి వెళ్లిపోండి. ఇలా ఎన్ని రోజులు పాటు కొనసాగితే అన్ని రోజులు పాటు ఆమె చేసిన ప్రతి పనిని మెచ్చుకుంటూ ఉండండి. కొన్నాళ్లకు ఆమె పనికి అలవాటు పడడం ఖాయం. ఆమె గ్లాసు నీళ్లు తెచ్చినా కూడా కచ్చితంగా ఆమెకు కృతజ్ఞత చూపించండి. ఇది ఆమెపై మంచి ప్రభావమే చూపిస్తుంది.
కాగితంపై రాయడం కష్టంగా ఉంటే వాయిస్ రికార్డ్ చేసి ఆమెకు పంపించండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ సౌమ్యంగా చెప్పండి. అలాగే ఆమెని ఎంతగా గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో కూడా వివరించండి. ఆమె మీకు ఏమేమి చేయాలని అనుకుంటున్నారో అవన్నీ చెప్పండి. మీ భార్య కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీ పనులను తగ్గించి మీకు శారీరక శ్రమ లేకుండా చూసుకునే అవకాశం ఉంది.
Also read: ఆస్తమా ఎందుకు వస్తుంది? వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా?