తిరుమల కొండ పైకి ఉగ్రవాదులు చొరబడ్డారని కలకలం రేగిన వేళ అదంతా అబద్ధమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి వెల్లడించారు. ఉగ్రవాదులు తిరుమలలోకి వెళ్లారని సమాచారం ఫేక్ అని ఖండించారు. కొందరు ఆకతాయిలు ఫేక్ మెయిల్ పంపారని, ప్రస్తుతం తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని చెప్పారు. భక్తులు ఇకపై ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు. తిరుమలలో భక్తుల భద్రత కోసం పోలీసు, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తిరుమలలో భద్రత పటిష్ఠంగా ఉందని చెప్పారు.


కలియుగదైవం కొలువైన తిరుమలలో ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకు సమాచారం రావడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉగ్రవాదులు తిరుపతిలో సంచరిస్తున్నారని పోలీసులకు, టీటీడీకి  మెయిల్ చేశాడు. ఆ వ్యక్తి మెయిల్ తో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీస్ అధికారులు తిరుమల ఆలయంలో ప్రవేశించే అవకాశం ఉందని అనుమానించి.. టీటీడీ భద్రతాధికారులని అప్రమత్తం చేశారు. దాంతో తిరుమలలోభద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు.


గత కొద్దీ రోజులుగా సులభ కార్మికుల సమ్మె కారణంగా పారిశుధ్య కార్మికుల రూపంలో ఉగ్రవాదులు తిరుమలకీ వచ్చారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తిరుమలలోని అన్ని ప్రాంతాలోని సిసి కెమెరా పుటేజీని పోలీసులు, భద్రతా సిబ్బంది పరిశీలించారు. బస్సులు, జన సంచారం, రద్దీ ఉన్న ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని భక్తులకు, స్థానికులకు పోలీసులు సూచించారు. అయితే ఉగ్రవాదుల చొరబాటుని పోలీస్ యంత్రాంగం అధికారికంగా దృవీకరించలేదు. 
తిరుమలలో భక్త సంచారం వుండే ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు..


తిరుమలలో ఉగ్రవాదుల చొరబాటు ప్రచారంపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు  పోలీసులకు సమాచారం అందినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోలీసులకు మెయిల్ వచ్చిందని తెలిపారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేశామని, చివరికి అది ఫేక్ మెయిల్ అని తేలినట్లు వెల్లడించారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు. తిరుమలలో భద్రత పటిష్ఠంగా ఉందన్నారు.