ఆస్తమా ఊపిరితిత్తులకు సోకే ఒక అలెర్జీ వ్యాధి. ఇది పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా బాల్యంలోనే అంటే పదేళ్ల వయసులోపే ఈ ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. ఇది వంశపారంపర్యంగా, జన్యుపరంగా  రావచ్చు. అయితే కచ్చితంగా రావాలని కూడా లేదు. తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 70 శాతం ఉంది. అంటే మిగతా 30% రాకపోవచ్చు అని అర్థం. కొందరికి పుట్టుకతోనే ఆస్తమా వస్తుంది. అది నిద్రాణ స్థితిలో ఉండి పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేసరికి బయట పడుతుంది. ఆస్తమాతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా మందులు వాడాల్సిందే. 


దీని లక్షణాలు ఇలా ఉంటాయి?
ఆస్తమా బారిన పడిన వారిని దగ్గు వేధిస్తుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో దగ్గు విపరీతంగా వస్తుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఛాతీ భాగంలో బిగుతుగా అనిపిస్తుంది.  ఛాతీపై బరువు పెట్టినట్టు ఫీలవుతారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు లేదా దగ్గినప్పుడు పిల్లి కూతలు వంటివి వస్తాయి. ఆయాసంగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అది ఆస్తమా అని అనుమానించాల్సిందే. 


అంటువ్యాధి కాదు
 ఆస్తమా జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది కానీ మనిషి నుంచి మనిషికి వ్యాపించే వ్యాధి మాత్రం కాదు. ఆస్తమా ఉన్న రోగులతో కలిసి జీవిస్తే పక్కవారికి వచ్చే అవకాశం లేదు, అయితే దీని నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారిపోతుంది. ఆస్తమా ఉందో లేదో చెప్పడం కోసం స్పైరో మెట్రీ, పిక్ ఫ్లో మీటర్ పరీక్షలతో నిర్ధారిస్తారు. అలాగే అలెర్జీ కారకాలను గుర్తించేందుకు చర్మ పరీక్షలు చేస్తారు. 


వీటికి దూరంగా ఉండాల్సిందే
ఆస్తమా రావడానికి కొన్ని రకాల అలర్జీ కారకాలు ఉంటాయి. అవి ముక్కును, నోటిని తాకిగే చాలు ఆస్తమా లక్షణాలు బయటపడతాయి. ఆ అలెర్జీ కారకాలు గాలి గొట్టం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. గొంతు నుంచి మొదలైన శ్వాసనాళం విడిపోయి చిన్న చిన్న గాలి గొట్టాలుగా మారిపోతాయి. ఆ గాలిగొట్టాలు ఊపిరితిత్తుల్లోని గాలి గదుల్లోకి చేరుతాయి. అక్కడికి గాలి ద్వారా అలెర్జీ కారకాలు చేరి ఇబ్బందిని కలుగజేస్తాయి.  కొందరికి చల్లగాలి పడదు. వానలో తడవకూడదు. ఏసీ వేసుకోకూడదు. ఇవన్నీ కూడా అలర్జీ కారకాలే. అలాగే పువ్వుల్లోని పొడి, దుమ్మూ ధూళి, వాహనాలు నుంచి వచ్చే పొగ, సిగరెట్ పొగ, అగరబత్తీల పొగ కూడా ఆస్తమా రోగులకు అలర్జీని కలిగిస్తుంది. సెంట్లు, అధికంగా వాసన వచ్చే సుగంధ ద్రవ్యాలు  అలర్జీ కారకాలే.  బొద్దింకలు, నల్లులు వంటివి కీటకాలు కూడా అలర్జీని పెంచుతాయి. పెంపుడు జంతువుల నుంచి రాలే వెంట్రుకలు ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. 


ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యం లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దుప్పట్లు, దిండు కవర్లు ప్రతివారం మార్చుకోవాలి. చల్లని వాతావరణంలో వేడి నీటితోనే స్నానం చేయాలి. ఇంట్లో దుమ్మూ ధూళి అధికంగా ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. 


పూర్తిగా నయం కాదా?
నిజం చెప్పాలంటే ఆస్తమాకు శాశ్వత పరిష్కారం లేదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి చికిత్స లేదు. అలెర్జీ కారకాలు శరీరంలో చేరితే వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని జాగ్రత్తలతో దీన్ని తట్టుకోవాలి. ఆస్తమా ఉన్న కూడా తగిన మందులు, జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవించ వచ్చు. 




Also read: పచ్చి మామిడితో ఇలా చట్నీ చేస్తే దోశె, ఇడ్లీలోకి అదిరిపోతుంది - వేసవి తాపం తగ్గుతుంది కూడా




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.