Maternity Leave: ఈ మధ్యనే సిక్కిం ప్రభుత్వం... ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలందరికీ ప్రసూతి సెలవులను ఏడాది పాటు పొడిగించినట్లు ప్రకటించారు. మన దేశంలో ఏడాది పాటు ప్రసూతి సెలవులను ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం సిక్కిం. ఈ ఏడాది పాటు ఆ ఉద్యోగినులకు జీతం అందిస్తారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులు... మాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం 6 నెలలు లేదా 26 వారాలు పాటు ఇస్తున్నారు. ఈ సమయంలో వారికి జీతాన్ని కూడా అందిస్తారు. అయితే కొన్ని దేశాల్లో సిక్కిం రాష్ట్రం ఇచ్చినట్టుగానే అమ్మలకు అధికంగా సెలవులు అందిస్తున్నారు. ఆ దేశాల్లోని అమ్మలను అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి.


లిథువేనియా
ఈ దేశంలో బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ సెలవులు పొందుతారు. తల్లికి 18 నెలల పాటు ప్రసూతి సెలవులు ఇస్తారు. తండ్రికి నాలుగు వారాలు పాటు సెలవు లభిస్తుంది. ఈ సెలవులన్నిటికీ పూర్తి జీతాన్ని చెల్లిస్తారు.


జర్మనీ
జర్మనీలో మూడు సంవత్సరాల వరకు తల్లులకు ప్రసూతి సెలవు ఇస్తారు. పిల్లలు పుట్టడానికి ఆరు వారాల ముందు నుంచే ఈ ప్రసూతి సెలవు తీసుకోవచ్చు. ప్రసూతి సెలవు ఇచ్చాక కొంత కాలం వరకు జీతాన్ని అందిస్తారు. కానీ మూడు సంవత్సరాలు పూర్తిగా జీతాన్ని ఇవ్వరు. కాకపోతే ఆ మూడేళ్లు వారి ఉద్యోగం మాత్రం భద్రంగా ఉంటుంది.


ఎస్టోనియా
ఈ చిన్న దేశంలో తల్లులు 140 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవును పొందుతారు. అయితే ఈ సెలవును కేవలం 30 నుండి 36 వారాల గర్భం ఉన్న సమయంలోనే తీసుకోవాలి.


హంగెరి
ఈ దేశంలో 24 వారాల ప్రసూతి సెలవులు జీతంతో పాటు అందుతాయి. అలాగే మూడేళ్ల పాటు ఆ తల్లికి ప్రసూతి ప్రయోజనాలు పొందవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు ఇస్తారు. అలాగే తల్లికి శిశువుకు సంరక్షణ భత్యాన్ని కూడా అందిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత 160 రోజులపాటు శిశు సంరక్షణ భత్యం అందుతుంది.


స్పెయిన్
తల్లులు, బిడ్డ పుట్టాక 16 వారాల పాటు ప్రసూతి సెలవు తీసుకోవచ్చు. అదే కవలలు అంతకన్నా ఎక్కువ మంది శిశువులు ఒకేసారి జన్మిస్తే 18 నుంచి 20 వారాల వరకు ఆ సెలవులను పొడిగించుకోవచ్చు. తండ్రులకు కూడా ఐదు వారాల పాటు సెలవు లభిస్తుంది.


స్వీడన్
స్వీడన్ దేశంలో బిడ్డ పుట్టాక తల్లిదండ్రులు ఇద్దరికీ 480 రోజులపాటు ప్రసూతి సెలవులు లభిస్తాయి. అలాగే కవలలు లేదా ట్రిప్లెట్స్ పుడితే 150 రోజులు అదనపు సెలవులు మంజూరు చేస్తారు. ఆ కాలంలో పూర్తి జీతాన్ని చెల్లిస్తారు.


ఇక మనదేశంలో ఆరు నెలల పాటూ ప్రసూతి సెలవులు అందిస్తారు. ఆ ఆరునెలల పాటూ జీతాన్ని అందిస్తారు. అంతకుముందు కేవలం మూడు నెలలే మెటర్నిటీ సెలవులు అందుబాటులో ఉండేవి. 


Also read: పూర్తిగా శాకాహారులుగా మారడం ఆరోగ్యానికి నిజంగా ప్రయోజనకరమా?


Also read: సూర్యాస్తమయం తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్, ఆ వ్యాధి ఉన్నట్లే



Join Us on Telegram:https://t.me/abpdesamofficial


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.