ఉత్తర భారతదేశంలో శీతల గాలులు పెరుగుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో గుండెపోటు కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నివేదికల ప్రకారం గత ఐదు రోజుల్లోనే 98 మంది గుండెపోటు లేదా స్ట్రోక్ కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో 44 మంది ఆసుపత్రికి తీసుకువచ్చాక మరణిస్తే, 54మంది చికిత్స అందేలోపే మరణించారు. దీన్ని బట్టి చలికాలంలో గుండెపోటు అధికంగా వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గత వారంలో వందల కొద్ది గుండె పోటు బాధితులు అత్యవసర విభాగాల్లో చేరడం, ఔట్ పేషెంట్ విభాగంలో వచ్చి వైద్యుల్ని సంప్రదించడం జరిగింది.అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? చలికాలంలోనే గుండెపోటు అధికంగా ఎందుకు వస్తుంది?


గుండెపోటు అంటే?
గుండెపోటు అనేది వైద్య పరమైన ఒక అత్యవసర పరిస్థితి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో ఏదైనా అడ్డుపడడం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకంగా మారి పరిస్థితి చేయి దాటిపోతుంది.


కారణాలు ఇవి...
1. అధిక కొలెస్ట్రాల్ 
2. అధిక రక్తపోటు 
3. అధిక ఒత్తిడి 
4. ధూమపానం 
5. ఆల్కహాల్ అధికంగా తాగడం 
6. ఊబకాయం 
7. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం 
వీటి కారణంగా సాధారణంగా గుండెపోటు వస్తుంది. అయితే శీతాకాలంలో చల్లని ఉష్ణోగ్రతల వల్ల కూడా గుండె పోటు రావడం కలవరం సృష్టిస్తోంది. 


చల్లని వాతావరణంలోనే ఎందుకు?
చల్లని వాతావరణం ఉన్నప్పుడే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే సందేహం అందరిలో వస్తుంది. దీనికి కారణం చలికాలంలో రక్తనాళాలు సంకోచిస్తాయి అంటే దగ్గరగా కూడుకుపోయినట్టు అవుతాయి. దీనివల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. దీన్నే ‘వాసో క్యాన్స్ట్రిక్షన్’ అని పిలుస్తారు. ఇది అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. దీనివల్ల గుండెపోటు వస్తుంది. సాధారణంగానే కరోనరీ ధమనులు ఇరుకుగా ఉంటాయి. ఇక శీతాకాలంలో అవి ఇంకా సంకోచిస్తే, రక్తప్రసరణ కష్టమైపోతుంది. కాబట్టి చల్లగాలులకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉదయపు నడకలు కొన్ని రోజులు మానేస్తే మంచిది. చాలామంది ఉదయం ఐదు గంటలకి, ఆరు గంటలకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయపు నడకకు బయలుదేరుతారు. చలికాలంలో ఆ ఉదయపు నడకను వాయిదా వేసుకుని, ఎండ వచ్చిన తర్వాత వెళ్లడం మంచిది. అలాగే చలివేయకుండా మందంగా ఉండే దుస్తులు ధరించాలి. చెవులలోకి చల్లగాలి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే గుండెపోటు సమస్యను తప్పించుకోవచ్చు. 


Also read: తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మగవారూ జాగ్రత్త - మీరు తండ్రయ్యే అవకాశాలు తగ్గిపోతాయి










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.