ఆధునిక కాలంలో ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఉద్యోగ ఒత్తిళ్లు... ఇలా రకరకాల సమస్యల వల్ల ఒత్తిడి మనిషిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ ఒత్తిడి ప్రభావం మగవారిపై అధికంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే అధిక ఒత్తిడికి దీర్ఘకాలికంగా గురవుతారో ఆ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని ఒక అధ్యయనం నిరూపించింది. 


వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో ఎక్కువకాలం పాటూ ఒత్తిడిని ఎదుర్కొంటున్న పురుషుల సంతాన ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంలో స్పెర్మ్ కౌంటు తగ్గడం, వాటిలో చురుకుదనం తగ్గడం ముఖ్యంగా కనిపించింది. కొందరిలో ఈ రెండింటి కారణంగా పిల్లలు కలగడం లేదు. అయితే కారణాలు తెలియని కేసులు కూడా అనేకం ఉన్నాయి. దాదాపు 50% కేసుల్లో వారికి ఎందుకు పిల్లలు కలగడం లేదో కూడా తెలియడం లేదని ఈ పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల చేసిన అనేక అధ్యయనాలలో మానసిక ఒత్తిడి, పోషకాహారం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేయడం వంటివి మగవారిలో పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్టు తేల్చాయి.


ఒత్తిడి, పిల్లలు పుట్టకపోవడం మధ్య సంబంధం పై చాలా ఏళ్లుగా చర్చలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు ఒక ఆసక్తికరమైన అధ్యయన ఫలితంతో ముందుకు వచ్చారు. వారు ఎలుకలపై మొదట అధ్యయనాన్ని నిర్వహించారు. ఎలుకలకు ఒత్తిడిని అధికంగా కలిగించి సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో గమనించారు. కొన్ని ఎలుకలను 30 రోజులు పాటు ప్రతిరోజు గంటన్నర నుంచి మూడు గంటల పాటు ఒత్తిడికి గురి చేశారు. తర్వాత వాటిలో స్పెర్మ్ నాణ్యతా పరిమాణాన్ని కొలిచారు. ఆ ఎలుకల్లో రోజువారి స్పెర్మ్ ఉత్పత్తిలో తీవ్ర క్షీణత కనిపించింది. ఆ ఎలుకల వల్ల సంతాన ఉత్పత్తి కూడా జరగలేదు.


స్పెర్మ్ నిర్మాణంలో అసాధారతను కూడా వారు కనుగొన్నారు. వీర్యం నిల్వ ఉండి, పరిపక్వం చెందే ఎపిడిడైమిస్ అనే భాగం అధికంగా ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తించారు. పరిశోధకుల చెప్పిన ప్రకారం ఒత్తిడికి గురయ్యాక  టెస్టికల్‌లోని అంతర్గత నిర్మాణం కూడా మారిపోయినట్టు గుర్తించారు.మగహార్మోన్ అయిన టెస్టోస్టోరాన్ ఉత్పత్తిపై కూడా చాలా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆక్సీకరణ ఒత్తిడి కూడా అధికంగా ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి దీర్ఘకాలిక ఒత్తిడి ఎదుర్కొనే పురుషులు సంతానాన్ని కలిగించే అంశంలో వెనుకబడుతున్నట్టు అధ్యయనం తేల్చింది. 


Also read: ఇతడు గుండె లేకుండా నెల రోజులు జీవించగలిగాడు, ఇంతకీ ఎలా?





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.