Why not Yscrp cadre not interst : ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్‌సీపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. వరుసగా రెండో సారి గెలిస్తే ఇక తమకు తిరుగు ఉండదని ఆ పార్టీ అధనేత, సీఎం జగన్ నమ్మకంతో ఉన్నారు. అయితే సీఎం జగన్ పార్టీని సమాయత్తం చేస్తున్న వ్యూహంలోనే ఏదో లోపం ఉందన్న గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తోంది. ఆ లోపం.. పార్టీ క్యాడర్ ను విస్మరించడం అని చెబుతున్నారు. అన్నీ వాలంటీర్లు, వార్డు సచివాలయ కార్యదర్శల కనుసన్నల్లోనే మొత్తం జరుగుతోంది. పార్టీని అధికారంలోకి తేవడానికి శ్రమించిన కార్యకర్తల పాత్ర అధికారలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు వారినందర్నీ మళ్లీ యాక్టివ్ చేయడం.. వైఎస్ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నేతలకు తలకు మించిన భారంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.
పార్టీ అగ్రనాయకత్వంపై అసంతృప్తిలో శ్రేణులు !
ప్రభుత్వం ఏర్పాటై మూడున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సంతృప్తికరంగా వున్న సూచనలు కానరావడం లేదు. క్షేత్ర స్థాయిలో పార్టీపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక నాయకత్వం పూర్తిగా గాలికి వదిలేసింది అన్న విమర్శలు ఆపార్టీ కార్యకర్తల నుంచే వెలువడుతున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు వైఎస్సార్సీపీ పార్టీ నిర్మాణం పక్కాగా ఉండేది. అన్ని స్థాయిలో పార్టీ కార్యకర్తలను మమేకం చేసేవారు. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశారు. బూత్ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో పటిష్టమైన వ్యవస్థ వుండేది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రావటంలో బూత్ కమిటీల పాత్ర కొట్టిపారేయలేనిది. అయితే ఇప్పుడు ఆ బూత్ కమిటీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అధికారం చేపట్టిన మూడున్నర సంవత్సరాలుగా ఏ స్థాయిలోనూ కనీసం ఒక్కటంటే ఒక్క పార్టీ సమావేశం సైతం ఏర్పాటు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్న సూచనలు కానవస్తున్నాయి.
పార్టీ గెలుపు కోసం కష్టపడినా పట్టించుకోలేదన్న అభిప్రాయంలో క్యాడర్ !
వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో వుండగా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టడంలోనూ, ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలు తిప్పికొట్టడానికి పార్టీ నాయకులు పోటీ పడేవారు. ఆందోళనా కార్యక్రమాల్లో కార్యకర్తలు పాలు పంచుకునేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి దిశానిర్దేశం లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉండగా జగన్ పిలుపునిస్తే అందరూ కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడేవారు. దిగువస్థాయి నుంచి పార్టీ యంత్రాంగం అంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా స్పందించే వారు. సహజంగా అధికారంలోకి రాగానే క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అయితే అందుకు భిన్నంగా వారిలో నైరాశ్యం ఆవరించి ఉందన్న భావన ఆ పార్టీ ముఖ్యుల్లో సైతం ఉంది. పార్టీ అధికార పీఠం అధిష్టించే వరకు క్రియాశీలంగా వ్యవహరించిన నాయకుల్లో చాలామంది ప్రస్తుతం చురుకుగా వ్యవహరించటం లేదు. దీనికి కారణం అధికారంలోకి వచ్చినా తమను పట్టించుకోవడం లేదన్న భావనేనంటున్నారు.
పార్టీ క్యాడర్‌లో నిస్తేజం ఆవరించిందా ?
ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి విమర్శలను అధికార పదవుల్లో వున్న కొద్దిమంది నాయకులు మాత్రమే తిప్పికొట్టాల్సిన పరిస్థితి నెలకొని వుంది. పార్టీ పరంగా వాటిని క్షేత్రస్థాయి నుంచి తిప్పికొడుతున్న దాఖలాలు కానరావడం లేదు. దీనివల్ల పార్టీకి సంబంధించి మౌత్ పబ్లిసిటీ కరవైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విపక్షంలో వుండగా జన శ్రేణులతో కళకళలాడిన పార్టీ కార్యాలయాలు నేడు వెలవెల బోతున్నాయి. చాలా చోట్ల పార్టీ కార్యాలయాల జాడే లేదు. దీంతో కార్యక్రమాల నిర్వహణకు ఒక కేంద్ర స్థానం లేకపోవడంతో చాలా చోట్ల నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వాలంటీర్ల కారణంగా తీవ్ర నష్టం జరిగిందా ?
వైసీపీ అధికారంలోకి వచ్చాక కారణం ఏదైనా.... ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పార్టీ క్యాడర్ ను నిర్వీర్యం చేసేలా మారాయి. ప్రతి యాబై ఇళ్లకు ఓ వాలంటీర్ ను పెట్టి సర్వాధికారాలు ఆ వాలంటీర్ చేతిలో పెట్టారు. వారు వైసీపీ కార్యకర్తలని ప్రచారం జరిగినప్పటికీ... ఇతర సీనియర్ కార్యకర్తలు కూడా వారి ముందు తేలిపోయారు. దీంతో తమ పార్టీ అధికారంలోకి వచ్చినా చిన్న పని చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వార్డు , గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటు కావడంతో అధికార పార్టీ కార్యకర్త, నేత అనే దానికి విలువ లేకుండా పోయింది. ఈ కారణంగా క్యాడర్ నిస్తేజం ఆవరించింది. దీన్ని ఇప్పటి వరకూ వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ గుర్తించకపోవడతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ప్రస్తుతం క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ గుర్తించి ఎంత త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే అంత మంచిదన్న వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. మరి వైఎస్ఆర్‌సీపీ పెద్దలు గుర్తిస్తారా?