ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చేశారు. ఆయన అమెరికా అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూజెర్సీలోని ఒక రెస్టారెంట్ ‘మోదీ జీ థాలీ’ పేరుతో కొత్త థాలీని ప్రవేశ పెట్టింది. ఆ రెస్టారెంట్ యజమాని ప్రవాస భారతీయుడు. గత 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. మోదీ వస్తున్న సందర్భంగా ప్రత్యేక థాలీని రూపొందించమని తన చెఫ్ లను ఆదేశించాడు. భారత్ లో పాపులర్ అయిన వంటకాన్నీ ఆ థాలీలో ఉండేలా చూశారు. ఆ థాలీలో ఏమేమి వంటకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


థాలీ అంటేనే ఎన్నో వంటకాల సమాహారం. ఇక మోదీజీ థాలీలో ఇడ్లీలు, కాశ్మీరీ దమ్ ఆలూ కర్రీ, ధోక్లా, సర్సన్ కా సాగ్ కూర, కోతింబీర్ వాడి అని పిలిచే మహారాష్ట్ర వంటకాలు ఉంటాయి. ఇందులోని ఇడ్లీలు భారతీయ జెండాను సూచించేలా మూడు రంగుల్లో ఉంటాయి. అలాగే కిచ్డీ, రసగుల్లా, పెరుగు, అప్పడం కూడా ఇందులో ఉంటాయి. వీటిని అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయుల డిమాండ్ మేరకు ఎంపిక చేసినట్టు చెబుతున్నారు రెస్టారెంట్ యజమాని. ఇక భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గౌరవార్థం థాలీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు రెస్టారెంట్ యజమాని తెలిపారు. ప్రస్తుతానికి, రెస్టారెంట్ అతని పేరు మీద ఆల్కహాల్ లేని పానీయాన్ని అంకితం చేసి అమ్ముతోంది.


ప్రధానమంత్రి 72వ పుట్టినరోజును పురస్కరించుకుని ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ కూడా 56 ఆహారాలతో కూడిన థాలీని అందించింది. శాఖాహారం థాలీ ధర రూ.2250తో పాటు, మాంసాహార థాలీ ధర రూ.2,550గా నిర్ణయించింది. ఈ థాలీని ఇద్దరు నుంచి ముగ్గురు తినవచ్చు. గతంలో బాహుబలి థాలీ కూడా చాలా పాపులర్ అయింది. ఆ థాలీని పూర్తిగా తిన్నవారికి నగదు బహుమతులు అందించిన దాఖలాలు కూడా ఉన్నాయి. 


థాలీ ఆధునిక ప్రపంచంలో పుట్టింది కాదు. దీని ప్రస్తావన ఆయుర్వేదంలో కూడా ఉంది. అన్ని రకాల ఆహారాలు శరీరంలోనికి చేరాలనే ఉద్దేశంతోనే థాలి అనేది జనించింది. శరీరంలోని అన్ని పోషకాలను సమతుల్యం చేయాలంటే అన్ని రకాల ఆహారాలు తినాలి. థాలీలో ఆరు రుచులకు సంబంధించిన ఆహారాలు ఉండాలి. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం,వగరు... ఈ ఆరు రుచులు శరీరంలో చేరడమే  థాలీ ప్రధాన ఉద్దేశం. సమతుల్య భోజనమే... ఆరోగ్యకరమైన శరీరాన్ని అందిస్తుంది.  



Also read: నా భార్య కన్నా ఆమె నాకు ఎక్కువ నచ్చుతోంది, ఏం చేయాలి?



Also read: బాలింతల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వారు పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడినట్టే



































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.