గర్భం ధరించాక తొమ్మిది నెలల ప్రయాణం ఒక ఎత్తు. ప్రసవించాక బిడ్డను చూసుకుంటూ తన పై తాను శ్రద్ధ తీసుకోవడం మరో ఎత్తు. ప్రసవానంతరం తల్లిలో ఎన్నో మార్పులు వస్తాయి. వారు తమతో పాటు మరొక ప్రాణి బాగోగులు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. అందులోనూ గర్భధారణ సమయంలో జరిగిన మార్పులు, ప్రసవం సమయంలో పడిన నొప్పులు కలిసి ఆమెను మానసికంగా చాలా కుంగ దీస్తాయి. ఈ మార్పు ప్రసవించాక ఆమెపై పడే అవకాశం ఉంది. అందుకే కొంతమంది తల్లులు డిప్రెషన్ బారిన పడుతుంటారు. బాలింతల్లో కనిపించే ఈ డిప్రెషన్‌ను పోస్టుపార్టమ్ డిప్రెషన్ అంటారు. ఇది ఒక మానసిక వ్యాధి. దీనికి ముఖ్యంగా కావలసింది కుటుంబ సభ్యుల మద్దతు. ఇది మరీ తీవ్రంగా ఉంటే చికిత్స అందించాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా దీని లక్షణాలు ఎలా ఉంటాయో అందరూ అవగాహన పెంచుకోవాలి.
పోస్టుపార్టమ్ డిప్రెషన్‌కు గురైన తల్లిలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. చిన్న చిన్న వాటికి ఏడుస్తారు. హార్మోన్లలో చాలా మార్పులు వస్తాయి. నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. ఎప్పుడూ విచారంగా ఉంటారు. ఏదో ఆందోళన పడుతూ కనిపిస్తారు. ఏ పని చేయడానికి అయినా శక్తి హీనంగా అనిపిస్తారు. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ ఉంటారు. ఆహారం తినేందుకు ఇష్టపడరు. ఇవన్నీ కూడా ఈ పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడిన తల్లిలో కనిపిస్తాయి. అందుకే ఈమెకు కుటుంబ సభ్యులు మద్దతు చాలా అవసరం.
కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ డిప్రెషన్ బారిన పడిన అనుభవం ఉంటే వారసత్వంగా కూడా ఇది ఆ కుటుంబంలోని ఆడపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కొంతమంది బాలింతలు ప్రసవానంతరం బై పోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధుల బారిన కూడా పడవచ్చు. అందుకే వారిపై ఎలాంటి మానసిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. సమయానికి ఆహారాన్ని అందిస్తూ వారిని చంటి పిల్లలా చూడాలి, బిడ్డ ఆలనా పాలనా వాళ్ళ మీద వదిలేయకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి వారు ఆ డిప్రెషన్ లో బిడ్డకు హాని కలిగించే అవకాశం ఉంది. ఇది తల్లీ బిడ్డల అనుబంధంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లీ... తన బిడ్డను చూసుకునేందుకు ఇష్టం చూపించదు. కొంతమంది తల్లులు పోస్టుపార్టమ్ సైకోసిస్ అనే తీవ్ర మానసిక రుగ్మతకు గురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో వారు బిడ్డను చంపవచ్చు కూడా. అమెరికాలో ప్రతి లక్ష మంది జననాల్లో ఇలా పోస్టుపార్టమ్ సైకోసిస్ బారినపడిన తల్లులు కారణంగా ఎనిమిది మంది శిశువులు హత్యకు గురవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ప్రసవానంతరం తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యులకు ఉంది.
పోస్టుపార్టమ్ డిప్రెషన్ లక్షణాలు మరీ తీవ్రంగా కనిపిస్తే మానసిక వైద్యులను సంప్రదించాలి. వారు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకో డైనమిక్ థెరపీ, ఇంటర్ పర్సనల్ సైకో థెరపీ వంటివి సూచిస్తారు. అలాగే కొన్ని మందులను కూడా అందిస్తారు.
Also read: చీజ్ పౌడర్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.