వంట అనేది ఒక కళ. సరైన రుచి, సువాసన వచ్చేలా వంట చేశామంటే ఆ కళ అద్భుతంగా ఉన్నట్టే. అయితే వంట ప్రక్రియ ఒక సైన్స్. మీరు వంట చేసేటప్పుడు ఎప్పుడైనా కూరల మీద నురుగు లాంటి పదార్థం ఏర్పడటం చూశారా? పప్పు లేదా ఇతర కాయధాన్యాలు వండినప్పుడు ఈ సబ్బు లాంటి నురుగు కనిపిస్తుంది. అది ఉడికేటప్పుడు అలాగే వస్తుందిలే అనుకుని దాన్ని తినేస్తారు. కానీ అది మానవ వినియోగానికి అసలు సురక్షితం కాదు. హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సబ్బు లాంటి నురుగు ఏంటి?
మూత తీసి ఉన్న దాంట్లో పప్పు కూరలు వండుతున్నప్పుడు లేదంటే ఉడకబెడుతున్నప్పుడు సబ్బు లాంటి నురుగు అవశేషాలు కనిపిస్తాయి. వాటిని తీసేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం పప్పు లేదా కాయధాన్యాలు వండేటప్పుడు కనిపించే నురుగు సపోనిన్ తో తయారు చేయబడి ఉంటుంది. ఆన్ లైన్ రిపోర్టుల ప్రకారం పప్పులో సపోనిన్ అనే గ్లైకోసైడ్ ఉంటుంది. అవి నీటితో కలిసినప్పుడు కరిగిపోతాయి. ఈ సపోనిన్ లు సబ్బుతో సమానమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అవి ఉడికేటప్పుడు గాలిని తీసుకుని ఫోం మాదిరిగా ఏర్పడతాయి.
పప్పు ఉడికేటప్పుడు అందులోని ప్రోటీన్లు విడుదల అవుతాయని మరొక సిద్ధాంతం చెబుతోంది. వేడి నీరు తగిలినప్పుడు అందులోని వాయువులు గిన్నె ఉపరితం మీద నురుగును ఏర్పరుస్తాయి. దీన్ని ప్రోటీన్ డీనాటరేషన్ అంటారు.
అవి హానికరమా?
ఇలా పప్పు ఉడికేటప్పుడు కనిపించే నురుగు హానికరమా అంటే అవునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది గ్లైకోసైడ్ సహజ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి పదార్థాన్ని తీసుకోవడం హానికరం. అందుకే వాటిని తినే ముందు ఉపరితలం మీద ఏర్పడిన నురుగు తొలగించడం మంచిది.
చికెన్ లో వచ్చే నురుగు మంచిదేనా?
చికెన్ ఉడికించేటప్పుడు కూడా నురుగు కనిపిస్తుంది. చికెన్ నానబెట్టి అమ్మడం వల్ల అందులోని నీరు ఈ విధంగా నురుగు రూపంలో బయటకి వస్తుందని అనుకుంటారు. చికెన్ ఉడికించేటప్పుడు కనిపించే సబ్బు నురుగుని ఒట్టు అని పిలుస్తారు. ఇది మలినం, ఎముకలపై ఏదైనా మాంసం నుంచి వచ్చే గడ్డకట్టిన ప్రోటీన్ ని కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఏ విధంగానూ హానికరం కాదు. ఇది ఆహార ప్రోటీన్. కానీ కొవ్వులు, చిన్న ఎముక శకలాలు వంటి ఇతర మలినాలు కూడా కలిగి ఉంటుంది. ఇది మాంసం ఆకృతి, రుచిని ప్రభావితం చేస్తుంది. బాగా ఉడికినప్పుడు ఆ నురుగు ఆవిరై పోతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: బరువు భయపెడుతోందా? ఇవిగో, ఈ డ్రై ఫ్రూట్స్ తినండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial