Infertile With Phone | మొబైల్ లేకపోతే శరీరంలో ఒక అవయవం లేనట్లే ఉంటుంది కదూ. కానీ, మొబైల్ అతిగా వాడితే.. నిజంగానే ఒక ‘అవయవం’ పనికిరాకుండా పోతుంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఈ తాజాగా నిపుణులు ఏం చెప్పారో చూడండి.
రోజూ ఫోన్లు మాట్లాడటమే కాదు. ఫోన్లలో ఆటలు ఆడినా, కింది జేబుల్లో పెట్టుకున్నా ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల మగతనానికే మొబైల్ సవాల్ విసురుతుందని అంటున్నారు. లైంగిక, సంతాన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. షెఫీల్డ్ యూనివర్సిటీలో ఆండ్రాలజీ ప్రొఫెసర్, స్పెర్మ్ నిపుణుడు అలన్ పేసీ ఇటీవల దక్షిణ కొరియా పరిశోధకుల నుంచి వచ్చిన కొన్ని తీర్మానాలను పరిశీలించారు.
మొత్తం 18 అధ్యయనాల్లో 4,280 స్పెర్మ్ నమూనాలపై జరిగిన పరిశీలనల గురించి తెలుసుకున్నారు. మొబైల్ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు స్పెర్మ్‌ను దెబ్బతీస్తున్నాయని ఆ పరిశోధనలు పేర్కొన్నాయి. పురుషులు తమ మగతనాన్ని కోల్పోకూడదంటే ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
‘‘ఆధునిక జీవితం పురుషుల స్పెర్మ్‌కు అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌ల వల్లే వారికి లైంగిక సమస్యలు ఏర్పడతాయి. పదేళ్లుగా జరుగుతున్న ఈ అధ్యయనాల్లో స్పెర్మ్-మొబైల్ వినియోగానికి మధ్య గల ప్రమాదకర కారణాలను గురించి ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరం. కానీ, ప్రాథమిక అంచనాల ప్రకారం, పురుషులకు మొబైల్ చాలా ప్రమాదకరం. వారు మొబైల్ ఫోన్లను జేబుల్లో కాకుండా బ్యాగ్‌లో ఉంచుకోవాలి’’ అని అలన్ పేసీ తెలిపారు.
సంతాన సమస్యలతో బాధపడుతున్న పురుషులు ఇప్పటికైనా మొబైల్ వినియోగాన్ని తగ్గించి స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. పుసాన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ యున్ హక్ కిమ్ మాట్లాడుతూ.. ‘‘సెల్-ఫోన్ ఉపయోగించే వినియోగదారులు తమ స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవడానికి మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. అయితే, ఇప్పుడు ఉన్న మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు, అవి స్పెర్మ్ కౌంట్‌పై చూపే ప్రభావంపై గురించి లోతైన పరిశోధన అవసరం’’ అని తెలిపారు.
ఈ కారణాలు వల్ల కూడా సంతాన సమస్యలు, బీ అలర్ట్:
బిగువుగా ఉండే లోదుస్తులు, ఫ్యాంట్లు వద్దు: ఈ రోజుల్లో అంతా టైట్ జీన్స్‌నే ఇష్టపడుతున్నారు. ఇది సంతాన సమస్యలను తెచ్చిపెడుతుంది. మీ ఇన్నర్స్ నుంచి ఫ్యాంట్ల వరకు ప్రతిదీ వదులుగా ఉండేలా చూడండి. ఎక్కువ సేపు గాలి ఆడకపోవడం వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల వృషణాలలో ఏర్పడే వేడి బయటకు వెళ్లదు. కాబట్టి కాటన్‌తో తయారు చేసిన ఇన్నర్స్, ఫ్యాంట్స్ లేదా షార్ట్స్, లుంగీలను మాత్రమే ధరించండి.
ఎక్కువసేపు కూర్చోవద్దు: ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వల్ల ఈ రోజుల్లో అంతా ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా ఒకే చోటులో దొర్లుతున్నారు. ఇది కూడా సంతాన సమస్యలను పెంచేస్తుంది. ఒకే చోట కూర్చోవడం వల్ల మీ మర్మాంగాల వద్ద వేడి పెరుగుతుంది. ముఖ్యంగా వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలు వేడెక్కుతాయి. కాబట్టి.. మధ్య మధ్యలో అటూ ఇటూ తిరగండి. కాసేపు నిలబడండి. ఇంట్లో ఉంటే వదులైన నిక్కర్లు లేదా లుంగీ ధరించి, వాటికి బాగా గాలిని తగలనివ్వండి.
అధిక వేడి ఎప్పుడూ ప్రమాదకరమే: వేడి ప్రదేశాల్లో నివసించే పురుషుల్లో సంతాన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలకు వేడి ఎక్కువగా తగలకూడదు. వృషణాలంటే స్పెర్మ్‌కు స్టోర్ రూమ్‌లాంటివి. అవి చల్లగా ఉన్నంత వరకే స్పెర్మ్ కూడా పాడవ్వకుండా నాణ్యంగా ఉంటుంది. లేకపోతే కణాలు క్షీణించి కౌంట్ తగ్గిపోతుంది. హాట్ టబ్‌లు, ఆవిరి స్నానం(స్టీమ్ బాత్), వేడి నీళ్ల స్నానాలు తగ్గించాలి.
ల్యాప్ టాప్‌లను ఒడిలో పెట్టుకోవద్దు: ఈ రోజుల్లో ఐటీ, మీడియా తదితర రంగాల్లో పనిచేసే ఉద్యోగులంతా ల్యాప్‌టాప్‌ల్లోనే పనిచేస్తున్నారు. చాలామందికి ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని పనిచేయడం అలవాటు. దానివల్ల ల్యాప్ టాప్‌ల్లో నుంచి విడుదలయ్యే వేడిగాలి నేరుగా వృషణాలను తాకుతుంది. ఫలితంగా స్పెర్మ్ దెబ్బతింటుంది. అలాగే, వేసవిలో ఫ్యాన్ నుంచి వచ్చే వేడిగాలి, వంట చేస్తున్నప్పుడు స్టవ్ నుంచి ఉత్పత్తయ్యే వేడి, జిరాక్స్ లేదా ఫొటోస్టాట్‌ల వద్ద నిలుచోవడం కూడా అంత మంచిది కాదు. స్నానం చేసేప్పుడు వేడి నీళ్లు వృషణాలకు తగలకుండా జాగ్రత్తపడండి.
సుదీర్ఘ ప్రయాణాలు, బైక్ రైడింగ్: బిగుతుగా ఉండే ఫ్యాంట్లు ధరించి ఎక్కువ దూరాలు బైకు మీద ప్రయాణించడం వల్ల కూడా సంతాన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఎక్కువ సేపు బైకు నడుపుతున్నా, ప్రయాణాల్లో ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు వృషణాలపై ఒత్తిడి, ఘర్షణ ఏర్పడుతుంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రయాణిస్తుంటే తప్పకుండా వదులైన ఫ్యాంట్లు లేదా నిక్కర్లు, షార్ట్స్ ధరించండి.
ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించండి: ప్లాస్టిక్‌లు తేలికైనవి, చౌకైనవి, సులభంగా లభ్యమవుతున్నాయి. దీంతో ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్ వస్తువులనే వాడుతున్నారు. తినే ఆహారాన్ని కూడా ప్లాస్టిక్ పాత్రల్లోనే నిలువ ఉంచుతున్నారు. ప్లాస్టిక్‌ల వాడకం కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, పురుషుల సంతానోత్పత్తికి కూడా హానికరమే. ఎందుకంటే అవి ఈస్ట్రోజెన్‌ల వలె పనిచేస్తాయి. ఆహారాన్ని మంటపై లేదా ఓవెన్‌లో లేదా మైక్రోవేవ్‌లో వేడి చేస్తున్నప్పుడు, క్లాంగ్ ఫిల్మ్‌ని ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ పాత్రలో ఆహారాన్ని అస్సలు వేడి చేయొద్దు. వేడి వల్ల వాటిలోని రసాయనాలు మీ ఆహారం, ద్రవాల్లోకి ప్రవేశిస్తాయి. ప్లాస్టిక్‌కు బదులుగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లలో ఆహారాన్ని నిల్వ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా వాడొద్దు. ప్లాస్టిక్ సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను మళ్లీ ఉపయోగించవద్దు.
ధూమపానం, మద్యం సేవించడం తగ్గించండి: ధూమపానం వల్ల అండాలు, స్పెర్మ్‌లోని జన్యు పదార్థం దెబ్బతింటుంది. ధూమపానం వల్ల గర్భస్రావం అవకాశాలున్నాయి. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. స్పెర్మ్ ఉత్పత్తి, DNA దెబ్బతింటుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలతో అసమతుల్యత ఏర్పడుతుంది.
Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!
Also Read: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?