Snakes on Medical Symbol | రెండు పాముల మధ్య ఒక కర్ర, దానికి జత రెక్కలు కలిగిన వైద్య చిహ్నాన్ని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా? వైద్యంతో సంబంధం లేని పాములను ఆ సింబల్‌లో పెట్టడానికి కారణం ఏమిటీ? ఆ రెక్కలు దేన్ని సూచిస్తాయి? వాస్తవానికి ఇది ఒక పురాతన చిహ్నం. దీని వెనుక పెద్ద కథే ఉంది.


రెండు చిహ్నాలు, వేర్వేరు కథలు: వైద్యానికి సంబంధించి రెండు రకాల చిహ్నాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముందుగా రెక్కలు, పాములున్న చిహ్నం గురించి తెలుసుకుందాం. ఈ చిహ్నాన్ని ‘కాడ్యూసియస్’(caduceus) అని పిలుస్తారు. ఒలింపియన్ దేవుడు హీర్మెస్(Hermes) వద్ద ఒక స్టిక్ ఉండేది. గ్రీకు పురాణాల ప్రకారం.. దేవతలకు మనుషులకు మధ్య హీర్మేస్ దూతగా ఉండేవాడు. దేవదూత కావడం వల్ల అతడికి రెక్కలు ఉండేవి. ఒకప్పుడు రోగులు వైద్యుడిని కలిసేందుకు కాలినడకన ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. హీర్మేస్ వారి బాగోగులను చూసుకొనేవాడు. అందుకే, వైద్య చిహ్నంలో అతడి రెక్కలు, కర్రను చేర్చారు.


ముందు తెల్ల రిబ్బన్లు, ఆ తర్వాత పాములు: ‘అపోలో’ అనే దేవుడు అప్పటి ప్రజలకు వైద్యం అందించేవాడు. ఆయన హీర్మేస్‌కు సహకరించేందుకు సిబ్బందిని అందించాడు. దేవతల రాజు జ్యూస్ కూడా హీర్మేస్‌కు సిబ్బందిని ఇస్తాడు. వారిద్దరు ఇచ్చిన సిబ్బందిని రెండు తెల్లని రిబ్బన్లుగా సూచించేవారు. చిహ్నం తయారీలో మొదట కర్రకు అటూ ఇటు రెక్కలతోపాటు రెండు తెల్ల రిబ్బన్లు చేరో వైపు ఉండేవి. కాలక్రమేనా ఆ రిబ్బన్లను పాములతో భర్తీ చేశారు. ఓ కథ ప్రకారం.. పోట్లాడుకుంటున్న రెండు పాములను హీర్మేస్ తన కర్రతో వేరు చేసి శాంతపరిచాడట. అప్పటి నుంచి అవి అతడి సిబ్బందితో కలిసి సామరస్యంతో ఉండేవట. అందుకే వాటిని ఆ చిహ్నంలో చేర్చారట.


అపోలో దేవుడి కొడుకు హత్య: మరో వైద్య చిహ్నంలో రెక్కలు ఉండవు. కేవలం ఒక పాము మాత్రమే ఉంటుంది. దీన్ని ‘అస్క్లెపియస్’(Asclepius) అని అంటారు. అపోలో దేవుడు, మానవ జాతికి చెందిన యువరాణి కరోనిస్‌లకు కలిగిన కుమారుడే ‘అస్క్లెపియస్’. పురాణాల ప్రకారం అతను అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది రోగులను తిరిగి ఆరోగ్యవంతులను చేశాడు. చనిపోయినవారిని తిరిగి బతికించేవాడు. కానీ, అదే అతడికి శాపమైంది. చనిపోయినవారిని తిరిగి బతికిస్తూ ప్రపంచంలోని సహజ క్రమానికి భంగం కలిగిస్తున్నాడే కారణంతో జ్యూస్ దేవుడు.. పిడుగుపాటుతో అస్క్లేపియస్‌ను చంపేశాడు. దీనికి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మనుషులను తిరిగి బతికించేందుకు అతడు కానుకలు వసూళ్లు చేసేవాడని, అందుకే జ్యూస్ అతడికి మరణ దండన విధించారని అంటారు.


అందుకే, రెండు వేర్వేరు వైద్య చిహ్నాలు: మరణం తర్వాత అస్క్లేపియస్‌ను జ్యూస్ నక్షత్రాల మధ్య ఓఫియుచస్‌(సర్పాన్ని మోసేవాడు)గా ఉంచాడు. గ్రీకులు పాములను పవిత్రంగా భావించేవారు. అస్క్లేపియస్‌ను గౌరవించడం కోసం వైద్య ఆచారాల్లో పాములను ఉపయోగించేవారు. పాము విషాన్ని నివారణ ఔషదంగా వాడేవారు. పాములు కుబుసం విడిచే ప్రక్రియ.. అంటే చర్మాన్ని వదిలి, కొత్త చర్మాన్ని పొందడాన్ని పునర్జన్మగా భావించేవారు. అందుకే, ఈ రెండు కథల ఆధారంగా ‘హీర్మేస్’ నిస్వార్థ సేవలు, ‘అస్క్లేపియస్’ వైద్య నైపుణ్యాలకు ప్రతీకగా దేవదూత రెక్కలు, ‘అస్క్లేపియస్’ పాములను వైద్య చిహ్నంలో చేర్చారని అంటారు. ప్రస్తుతమైతే ‘కాడ్యూసియస్’, ‘అస్క్లేపియస్’ చిహ్నాలు రెండూ వాడుకలో ఉన్నాయి. ‘అస్క్లేపియస్’ చిహ్నం(పాము, కర్ర)ను పురాతన గ్రీకు భవనాలపై కూడా చూడవచ్చు.


 


Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!


Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?