Healthy South Indian Dosa Recipe : దోశల్లో వివిధ రకాలు ఉంటాయి. అలాగే దోశ పిండిని కూడా వివిధ రకాలుగా చేసుకోవచ్చు. అలాంటి పిండిని మిల్లెట్స్‌తో సిద్ధం చేసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. మధుమేహం, బరువు, కొలెస్ట్రాల్ వంటి వాటిని కంట్రోల్ చేసి.. హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తుంది. మరి ఈ మిల్లెట్స్ దోశలను ఎలా చేసుకోవాలి? దానిలోకి ఏ చట్నీ బాగుంటుంది? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే దోశలు మంచిగా వస్తాయి వంటివి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
జొన్నలు - అరకప్పు
సజ్జలు - అరకప్పు
కొర్రలు - అరకప్పు
వరిగెలు - అరకప్పు
రాగులు - అరకప్పు
పచ్చి శనగపప్పు - కప్పు
కంది పప్పు - కప్పు
పెసరపప్పు - కప్పు
శనగలు - కప్పు
మినుములు - కప్పు
బియ్యం - 4 కప్పులు
తయారీ విధానం
జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, వరిగెలు, పచ్చి శెనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగలు, మినుములు, బియ్యం వీటిలో రాళ్లు, డస్ట్ లేకుండా ఏరుకుని అన్ని కలిపి ఓ గిన్నెలో వేసుకుని నానబెట్టాలి. మిల్లెట్స్ అన్ని మునిగి.. దానికి రెట్టింపు నీటిని వేసి పగలంతా నానబెట్టుకోవాలి. రాత్రి వాటిని శుభ్రంగా కడిగి.. మిక్సీజార్‌లో వేసుకుని మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. అవసరానికి తగ్గట్లు నీటిని పోసుకుంటూ.. దోశల పిండి మాదిరిగా దీనిని కలిపి పెట్టుకోవాలి. రాత్రంతా దీనిని పులియబెట్టేందుకు గిన్నెలో వేసి బయట ఉంచేయాలి.
పిండి పులిస్తే రుచి బాగుంటుంది..
ఉదయాన్నే పిండి పులిసి పొంగుతుంది కాబట్టి దానిని బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దోశ పాన్ పెట్టుకోండి. దానిపై కాస్త నూనె అప్లై చేసి.. పిండిని దోశలుగా పోసుకోవాలి. చుట్టూ కాస్త ఆయిల్ వేసి కాల్చుకోవాలి. పలుచగా వేసుకుంటే ఓ వైపు మాత్రమే రోస్ట్ చేస్తే సరిపోతుంది. లేదంటే రెండు వైపులా కాల్చుకోవాలి. మీకు దోశ క్రిస్పీగా, కరకరలాడుతూ కావాలంటే పిండిని సన్నగా వేసుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే కాస్త మందంగా వేసుకోవాలి.
ఈ చట్నీ మంచి కాంబినేషన్
పిండితో ఇలా మీకు నచ్చిన క్వాంటిటీలో దోశలు వేసుకుంటే మిల్లెట్స్ దోశలు రెడీ. దీనిని పల్లీ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పల్లీలను డ్రై రోస్ట్ చేసి.. వాటిపై పొట్టు తీసేయాలి. వెంటనే ఓ చిన్న కడాయి పెట్టి దానిలో నూనె వేసి.. ఓ పది పచ్చిమిర్చి లేదా మీ రుచికి తగ్గట్లు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. దానిలో జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. 5 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి సిద్ధం చేసుకోవాలి. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేస్తే టేస్టీ చట్నీ రెడీ అవుతుంది. దీనిని తాళింపు వేసుకోకుండా కూడా తినొచ్చు. మిల్లెట్స్ దోశకి ఇది మంచి కాంబినేషన్. ఇవి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
Also Read : దోశ పిండి లేకుండా టేస్టీ దోశలు ఇలా సింపుల్‌గా చేసేయండి.. చట్నీ కాంబినేషన్ ఇది అయితే పర్ఫెక్ట్