‘లైగర్’ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో వీల్ చైర్ కి పరిమితమయ్యారు. కొన్నేళ్ళ పాటు బాక్సింగ్ రంగాన్ని ఏలిన రారాజుగా నిలిచిన వ్యక్తి ఇప్పుడు కదల్లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? సయాటికా అనే అరుదైన నరాల వ్యాధి. తమ అభిమాన లెజెండ్ ఇలా వీల్ చైర్ లో కనిపించడం చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్ లో ఆయన హెల్తీగానే కనిపించారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించిన ఈ లెజెండ్ అకస్మాత్తుగా  వీల్ చైర్ లో కనిపించే సరికి అంతా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకి రావడంలో వైరల్ గా కూడా మారాయి.


ఇటీవల మైక్ టైసన్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సయాటికా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పారు. దాని వల్ల వచ్చే బాధ కారణంగా మాట్లాడలేకపోతున్న అని ఇదే తనకి ఉన్న ఏకైక ఆరోగ్య సమస్య అని చెప్పుకొచ్చారు. టైసన్ 1987 నుండి 1990 వరకు ప్రపంచంలో తిరుగులేని బాక్సింగ్ ఛాంపియన్‌గా రాణించారు. 2005లో బాక్సింగ్ నుంచి టైసన్ తప్పుకున్నారు.  తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా ఆయన తన కెరీర్ ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తనకి వచ్చిన వ్యాధి కారణంగా ఎక్కువగా నడవలేరు. నడిచేందుకు చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల వీల్ చైర్ లో ఉండాల్సి వస్తుంది.


అసలేంటి ఈ సయాటికా?


మయో క్లినిక్ ప్రకారం సయాటికా అంటే తుంటి లేదా తొడ వెనుక భాగం నరాల మార్గంలో వచ్చే నొప్పి. తొడ వెనుక భాగం నరాల్లో దగ్గర నుంచి వీపు, పిరుదులు ద్వారా రెండు కాళ్ళకి నొప్పి వ్యాపిస్తుంది. ఈ పరిస్థితిలో తీవ్రమైన మంట, నొప్పి, తరచుగా కాళ్ళల్లో తిమ్మిర్లు ఉంటాయి.


లక్షణాలు ఏంటి?


☀ వీపు కింద, పిరుదుల దగ్గర తీవ్రమైన మంట, నొప్పి


☀ తిమ్మిర్లు


☀ జలదరింపు లేదా కండరాల బలహీనత


☀ నడవలేని పరిస్థితి


☀ వయసు, బరువు సమస్యలు, అధికంగా పని చేయడం, ఎక్కువ సేపు కూర్చోవడం, మధుమేహం వంటివి కూడా సయాటికా వ్యాధితో ముడిపడి ఉన్నాయి.


నివారణ ఏంటి?


సయాటికాని నిరోధించలేము. ఇది తగ్గినట్టుగా అనిపించినప్పటికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. వెన్నెముక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


వ్యాయామం: శరీరం ధృడంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి.


సరైన రీతిలో కూర్చోవాలి: సరైన భంగిమలో కూర్చోవడం అనేది మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ వెన్నెముకకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం కూర్చునె విధానం మీద ఆధారపడి ఉంటుంది. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే నిటారుగా కూర్చోవడం చాలా అవసరంఅని వైద్యులు కూడా చెబుతారు.


శరీరం కదల్చాలి: ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వంటివి అసలు చెయ్యకూడదు. శరీరం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సేపు నిలబడినా కూర్చున్నా కూడా ప్రమాదమే. అందుకే మధ్య మధ్యలో కొద్దిసేపు నిలబడటం కూర్చోవడం వంటివి చెయ్యాలి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!


Also Read: నూనె Vs వెన్న - హార్ట్ పేషెంట్లకు ఏది మంచిది?