అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా  ‘పుష్ప: ది రైజ్’. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర అద్భుత విజయం సాధించింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరెక్కిన ఈ సినిమా సౌత్ టు నార్త్  థియేటర్లలో రచ్చ చేసింది. భారీగా కలెక్షన్లను రాబట్టింది. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ నటనకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. ‘తగ్గేదేలే..’ అంటూ అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌  ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా  విడుదలైన ఏడాది దగ్గర పడుతున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ  సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమా వైరల్‌ అవుతూనే ఉంది.ఈ సినిమాకు సంబంధించిన మీమ్స్  రచ్చ రచ్చ చేస్తున్నాయి.


ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్


గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యింది. ఇండియాలో మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో డబ్‌ చేశారు. అల్లు అర్జున్‌ పాపులర్‌ డాన్స్‌ నంబర్‌ అయిన ‘శ్రీవల్లి’ పాటతో పాటు సమంతా నటించిన ‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’ అనే పాటలు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా ముందుకు సాగుతున్నాయి. హీరోయిన్ గా నటించిన రష్మిక మందాన.. తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమా 7 జనవరి 2022న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదలై మంచి జనాధారణ దక్కించుకుంది.


త్వరలో రష్యాలో విడుదల


ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా క్రే లభిస్తోంది.  ఇటీవల ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో స్క్రీనింగ్ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ బాస్టర్‌ గా నిలిచిన సినిమాల కేటగిరిలో పుష్ప తెలుగు వెర్షన్‌ సినిమాను ఇంగ్లిషు, రష్యన్‌ సబ్‌ టైటిల్స్‌ తో ప్రదర్శించారు. అంతేకాదు..  త్వరలో ఈ సినిమా రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ ను కూడా విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.  ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, ఫహాద్‌ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.    


వచ్చే ఏడాది సీక్వెల్ విడుదల


పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఫస్ట్‌ పార్ట్ అద్భుత విజయాన్ని అందుకోవడంతో..  సుకుమార్‌ సీక్వెల్‌పై  ప్రత్యేక దృష్టిసారించాడు. బడ్జెట్‌, క్యాస్టింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సీక్వెల్‌ చిత్రం మరెన్ని వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 


Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?



Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా? లేదా?